ఫ్లిప్కార్ట్ ను దెబ్బకొట్టిన అమెజాన్
బెంగళూరు : ధరల కోతతో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తో క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఆటకు తెరతీసింది. తన ప్లాట్ ఫాం వాడుకున్నందుకు అమ్మకందారులకు విధించే ఫీజుల్లో కొన్ని కేటగిరీ ఉత్పత్తులకు అమెజాన్ 1 నుంచి 7శాతం వరకు కోత విధించిన్నట్టు పేర్కొంది. కరెక్టుగా తనకు ప్రత్యర్థిగా ఉన్న ఫ్లిప్ కార్ట్ పెంచిన అమ్మకదారుల కమిషన్ అమలుచేసే మూడు రోజుల ముందు అమెజాన్ ఈ నిర్ణయం ప్రకటించింది. దీంతో ఓ కొత్త రూపంలో ఈ-కామర్స్ స్పేస్ లో ధరల యుద్ధం ప్రారంభం కాబోతుందని స్పష్టమవుతోంది.
పర్సనల్ కంప్యూటర్లు, మొబైల్ డివైజ్ లు, టాబ్లెట్స్, ఎలక్ట్రానిక్స్, మూవీస్, మ్యూజిక్, వీడియో గేమ్స్, వీడియో గేమ్ కన్సోల్స్, నాన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ సాప్ట్ వేర్, మ్యూజికల్ ఇన్ స్ట్రుమెంట్స్, పర్సనల్ కేర్ అప్లియెన్స్ లకు ఈ కోత ఫీజులను నేటి(శుక్రవారం) నుంచి అమలు చేయనున్నట్టు కంపెనీ అమ్మకందారులకు ఈ-మెయిల్ ద్వారా ప్రకటించింది. ఈ ఫీజుల కోతతో అమ్మకందారులు ఈ ప్రయోజనాలను వినియోగదారులకు చేరవేసి, ఉత్పత్తులపై ధరలు తగ్గించాలని భావిస్తున్నారు. అమెజాన్ ఈ ఫీజు కోత నిర్ణయం ఫ్లిప్ కార్ట్ ఫ్లాట్ ఫాంపై ఉన్న అమ్మకందారులకు అవరోధంగా మారబోతోంది. ఫ్లిప్ కార్ట్ నుంచి బయటికి వెళ్లేందుకు అమ్మకందారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు.
ఫ్లిప్ కార్ట్ ఇటీవల తీసుకున్న వివిధ ఉత్పత్తులపై కమిషన్ పెంపు, ఈ నెల 20 నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో అమెజాన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఫ్లిప్ కార్ట్ అమ్మకాలకు గండికొడుతున్నట్టు తెలుస్తోంది. " అవును..కొన్ని కేటగిరీల్లో ఉత్పత్తులపై అమ్మకందారులకు రెఫరల్ ఫీజులను తగ్గించాం.. ఈ సవరించిన రేట్లతో ప్లాట్ ఫామ్ అమ్మకందారుల ప్రయోజనాలు మెరుగుపడి, విజయతీరాలకు చేరుకోవడానికి గణనీయమైన సాయం అందుతుంది" అని అమెజాన్ ఇండియా అధికార ప్రతినిధి వెల్లడించారు.