
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రకరకాల కారణాలతో ఇప్పటికీ బేసిక్, ఫీచర్ ఫోన్లను వాడుతున్న కస్టమర్లు... మెల్లగా స్మార్ట్‌కు మొగ్గుతున్నారు. కాస్త ఖరీదైన మోడళ్లకు అప్‌గ్రేడ్ అవుతున్నారు. వివిధ కంపెనీలు ఆకర్షణీయ డిజైన్లలో మోడళ్లను తెస్తుండటం... ధరలూ కాస్త దిగిరావటం, ప్రీమియం మోడళ్లలో ఉండే ఫీచర్లు చాలావరకూ మిడ్ సెగ్మెంట్‌కు రావడం దీనికి ప్రధాన కారణాలని చెప్పొచ్చు. వినియోగదార్లు తమ తదుపరి ఫోన్ కోసం క్రితం కంటే ఎక్కువే ఖర్చు చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నెలకు 80 లక్షల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడవుతున్న మన మొబైల్ మార్కెట్లో మూడేళ్ల క్రితంతో పోలిస్తే ధరల శ్రేణి, బ్రాండ్ల విషయంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక వెలుగు వెలిగిన కంపెనీలు కనుమరుగు కాగా, కొన్ని చైనా బ్రాండ్లు రూ.10–20 వేల మిడ్ సెగ్మెంట్లో తమ సత్తా చాటుతున్నాయి. పోటీ ధరలే ప్రస్తుతం పెద్ద ఇన్నోవేషన్‌గా చెప్పుకోవచ్చు.
తగ్గుతున్న రూ.10వేల లోపు ఫోన్లు!!
భారత స్మార్ట్‌ఫోన్ విపణిలో రూ.10,000లోపు లభించే స్మార్ట్‌ఫోన్ల విభాగం అత్యంత కీలకం. యూనిట్ల పరంగా సింహ భాగం కైవసం చేసుకున్నది కూడా ఈ విభాగమే. ఓ పరిశోధన సంస్థ గణాంకాల ప్రకారం 2015లో ఈ సెగ్మెంట్ వాటా ఏకంగా 70.8 శాతం నమోదైంది. ఇప్పుడు ఇది 55.8 శాతానికి వచ్చి చేరింది. కస్టమర్లు ఖరీదైన మోడళ్లవైపు మొగ్గు చూపుతున్నారనడానికిదే నిదర్శనం.
డిమాండ్ రూ.10–20 వేల మధ్య..
2015తో పోలిస్తే మొత్తం స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో రూ.10–15 వేల ధరల విభాగం 11.8 నుంచి రెండింతలకుపైగా అధికమై 27.4 శాతానికి చేరింది. రూ.15–20 వేల శ్రేణి 7.6 నుంచి 10.9 శాతానికి పెరిగింది. మొత్తంగా రూ.10–20 వేల విభాగం మూడేళ్లలో రెండింతలై 38.3 శాతానికి చేరుకుంది. ఫీచర్లకు తోడు ఈఎంఐ సౌకర్యం ఈ సెగ్మెంట్ వృద్ధికి కారణమని హ్యాపీ మొబైల్స్ ఎండీ కృష్ణ పవన్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ప్రస్తుతం 950 మోడళ్ల వరకూ రూ.5–20 వేల ధరలో లభిస్తున్నాయి. ప్రీమియం మోడళ్లలో ఉండే ఫీచర్లయిన 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ, 16 ఎంపీ కెమెరా వంటివి ఈ మోడళ్లలో లభిస్తున్నాయి.
ప్రీమియం సెగ్మెంట్ డీలా..
రూ.20 వేలు ఆపైన లభించే ప్రీమియం విభాగం వాటా మాత్రం మెల్లగా తగ్గుతూ వస్తోంది. మూడేళ్ల క్రితం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఈ సెగ్మెంట్‌కు 9.8% వాటా ఉండేది. ఇప్పుడిది 5.9%కి తగ్గింది. ఈ విభాగంలో ఇప్పుడు 150 దాకా మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ‘‘కస్టమర్లు ఫీచర్లకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని, బ్రాండ్స్‌ను పట్టించుకోవడం లేదు’’ అని మొబైల్స్ రిటైల్ చైన్ టెక్నోవిజన్ ఎండీ సికందర్ చెప్పారు. ఇక అమ్మకాల్లో మెట్రో సిటీలను ఇతర ప్రాంతాలు మించిపోయాయి. మెట్రోల వాటా 46%, నగరాలు, పట్టణాలు, గ్రామాలు 54% వాటా దక్కించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment