న్యూఢిల్లీ: నీరవ్ మోదీ కుంభకోణం దెబ్బతో వరుసగా మూడు త్రైమాసికాల పాటు భారీ నష్టాలు ప్రకటిస్తూ వచ్చిన ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) మొత్తానికి మళ్లీ లాభాల బాట పట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 247 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నమోదైన రూ. 230 కోట్లతో పోలిస్తే ఇది 7.12 శాతం అధికం. తాజాగా మొండిబాకీలకు కేటాయింపులు తగ్గటం ఇందుకు తోడ్పడింది. ఆదాయం సుమారు 3 శాతం క్షీణించి రూ. 15,257 కోట్ల నుంచి రూ. 14,854 కోట్లకు తగ్గింది. వరుసగా మూడు త్రైమాసికాలుగా నష్టాలు ప్రకటిస్తూ వస్తున్న పీఎన్‌బీ తాజా ఫలితాలు విశ్లేషకుల అంచనాలను తారుమారు చేశాయి. మూడో త్రైమాసికంలో పీఎన్‌బీ దాదాపు రూ. 1,063 కోట్ల మేర నష్టాలు ప్రకటించవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ‘మా బాధ్యతలన్నీ నిర్వర్తించాం. (నీరవ్ మోదీ ఫ్రాడ్‌కి సంబంధించి) పూర్తి స్థాయిలో ప్రొవిజనింగ్ చేశాము‘ అని పీఎన్‌బీ ఎండీ సునీల్ మెహతా తెలిపారు. మూడో క్వార్టర్‌లో దాదాపు రూ. 16,000 కోట్ల మేర మొండిబాకీలు రికవర్ కావడం కూడా పనితీరు మెరుగుపడటానికి తోడ్పడిందని ఆయన వివరించారు.
ఎన్‌పీఏలు తగ్గుముఖం...
గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే తాజా క్యూ3లో ఇచ్చిన మొత్తం రుణాల్లో స్థూల మొండిబాకీలు (ఎన్‌పీఏ) 12.11 శాతం నుంచి 16.33 శాతానికి పెరిగాయి. అయితే, నికర ఎన్‌పీఏలు మాత్రం 8.90 శాతం నుంచి 8.22 శాతానికి తగ్గాయి. ఆదాయ పన్ను కాకుండా మొత్తం ప్రొవిజనింగ్ రూ. 4,467 కోట్ల నుంచి రూ. 2,754 కోట్లకు తగ్గాయి. ఇందులో మొండిబాకీలకు చేసిన కేటాయింపులు రూ. 2,566 కోట్లు (ఈ మొత్తంలో నీరవ్ మోదీ ఫ్రాడ్ ప్రొవిజనింగ్ సుమారు రూ. 2,014 కోట్లు). గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇది రూ. 2,996 కోట్లుగా ఉంది. మొండిబాకీలకు కేటాయింపులు సీక్వెన్షియల్‌గా చూస్తే 67 శాతం క్షీణించి రూ. 7,733 కోట్ల నుంచి రూ. 2,566 కోట్లకు తగ్గాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో మంగళవారం బీఎస్‌ఈలో పీఎన్‌బీ షేరు అరశాతం పెరిగి రూ. 73.55 వద్ద క్లోజయ్యింది.
పీఎన్‌బీ .. మళ్లీ లాభాల్లోకి!!
Published Wed, Feb 6 2019 5:31 AM | Last Updated on Wed, Feb 6 2019 5:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment