
సాక్షి, ముంబై: అదానీ గ్రూపునకు చెందిన సంస్థ ఖతార్ నుంచి భారీ పెట్టుబడులను సాధించింది. అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ (ఏటీఎల్), అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ (ఏఈఎమ్ఎల్) లో 25.1 శాతం వాటా ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (క్యూఐఏ)కొనుగోలు చేయనుంది. తద్వారా రూ .3200 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు అదానీ ట్రాన్స్‌మిషన్ రెగ్యులేటరీ సమాచారంలో వెల్లడించింది. ఈ డీల్ ప్రకారం అదానీ ట్రాన్స్మిషన్, ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ 2023 నాటికి ఏఈఎమ్ఎల్ సరఫరా చేసే 30శాతం విద్యుత్తును సౌర , పవన విద్యుత్ ప్లాంట్ల నుండి పొందేందుకు ఖచ్చితమైన ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది. ఈ ఒప్పందంపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, క్యూఐఏ సీఈవో మన్సూర్ అల్-మహమూద్ సంతోషం వ్యక్తం చేశారు. ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీతో ఈ భాగస్వామ్యం ద్వారా 3 మిలియన్లకు పైగా తమ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తామని అదానీ వెల్లడించారు.