ఫస్ట్ డే..ఫస్ట్ షో..ఎలాగైనా చూసెయ్యాలి...ఇదీ సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానుల కోరిక. మరి అలాంటిది ఎప్పటినుంచో ఉత‍్కంఠగా చూస్తున్న ప్రముఖ దర్శకుడు శంకర్, రజనీ, బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్, సంగీత దర్శకుడు ఏఆర్ రహ్మాన్‌ల గ్రేట్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా థియేటర్లను పలకరిస్తోంటే.. ఇక ఆ సందడే వేరు. ఆఫీసులకు సెలవుపెట్టి మరీ మూవీకి చెక్కెయ్యాల్సిందే. అదీ తలైవా మానియా. ఈ నేపథ్యంలోనే కోయంబత్తూరుకు చెందిన ఒక స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీంతో బాస్ అంటే వీడేరా అంటూ..ఉద్యోగులు థియేటర్లకు పరుగులు తీయడంలో అతిశయోక్తి ఏముంది... విషయం ఏమిటంటే...
కోయంబత్తూరులోని గెట్ సెట్ గో అనే సంస్థ తన ఉద్యోగులకు 2.ఓ మూవీ విడుదల సందర్భంగా నవంబరు 29న అధికారిక సెలవు దినంగా ప‍్రకటించేసింది. పనినుంచి మీకు ఊరట. 2.0 మోడ్ ఆన్..ఛలో థియేటర్స్ అంటూ ఉద్యోగులకు ఒక లేఖ రాసింది. అంతేకాదు..ఈ మూవీకి వెళ్లాలనుకునేవారికి మొదటి రోజు టికెట్లను కూడా ఉచితంగా అందిస్తామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. పనిలో పనిగా తలైవా, పద్మవిభూషణ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సార్.. శంకర్ సర్, ప్రతినాయకుడుగా ఖిలాడీ అక్షయ్ కుమార్, ఇతర నటీనటులు, సంగీత దర్శకుడు ఎఆర్ రహ్మాన్‌తోపాటు, చిత్ర యూనిట్ మొత్తంపై ప్రశంసలు కురిపించింది.
కాగా ప్రపంచవ్యాప్తంగా 10వేల స్క్రీన్లలో రిలీజవుతోంది. ముఖ్యంగా దేశీయంగా బాహుబలి-2 రికార్డులను తిరగరాస్తూ వేల థియేటర్లను రోబో చిట్టి పలకరిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment