
రేట్ల కోతతో వృద్ధికి ఊతం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేవారం రెపోరేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణంపై ఆర్‌బీఐ వసూలుచేసే...
♦ ఆర్‌బీఐ ‘నిర్ణయం’పై కేంద్రం ఆశలు
♦ 2015-16లోనే 9% వృద్ధి అంచనా
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేవారం రెపోరేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణంపై ఆర్‌బీఐ వసూలుచేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.5 శాతం) కోత చర్య తీసుకుంటుందని కేంద్రం భావిస్తోంది. మోడీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణ్యన్ మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
వచ్చేవారం రిజర్వ్ బ్యాంక్ రెపోరేటును తగ్గించి వృద్ధికి ఊతం ఇస్తుందన్న విశ్వాసాన్ని ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. సాధారణంకన్నా తక్కువ వర్షపాతం నమోదయినప్పటికీ, తగిన ఆహార నిల్వలు ఉన్నాయని ఆయన పేర్కొంటూ... ఇది ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉంచే అంశమని అన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని రెపో రేటు కోత నిర్ణయాన్ని ఆర్‌బీఐ తీసుకుంటుందన్న అభిప్రాయాన్ని సుబ్రమణ్యన్ వ్యక్తం చేశారు. జూన్ 2న ఆర్‌బీఐ పాలసీ సమీక్ష సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
♦ ఏప్రిల్‌లో ఆదాయపు పన్ను వసూళ్లలో 9.5 శాతం వృద్ధి చోటుచేసుకుంది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు గత 7.4 శాతం నుంచి 9 శాతానికి మెరుగుపరుస్తుందన్న అంచనాలకు ఊతమిస్తోంది.
♦ పరోక్ష పన్నులు 0.9 శాతం-0.8 శాతం శ్రేణిలో పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 7.7 శాతం నుంచి 9 శాతం శ్రేణిలో పెంచే అంశం.
♦ క్యాడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది జీడీపీలో 1శాతానికన్నా తక్కువగాానే ఉండే అవకాశం ఉంది.
♦ చమురు ధరలు బేరల్‌కు 50-80 డాలర్ల శ్రేణిలోనే కదలాడే అవకాశం ఉంది. ఇది భారత్‌కు కలిసివచ్చేదే.
♦ ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు కట్టడి, అంతర్జాతీయ సానుకూలతల వంటి అంశాలు రేట్ల కోతకు వీలు కల్పిస్తున్నాయి.