బంగారు నాణేల దిగుమతులపై ఆంక్షల తొలగింపు
ముంబై: బంగారం నాణేలు, మెడల్స్ దిగుమతులకు సంబంధించి బ్యాంకులు, ట్రేడింగ్ హౌస్‌లపై ఉన్న ఆంక్షలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బుధవారం ఎత్తివేసింది. కరెంట్ అకౌంట్ లోటు తీవ్రత నేపథ్యంలో ఆగస్టు 2013లో కేంద్ర బ్యాంక్ బంగారు నాణేలు, మెడల్స్ దిగుమతులపై ఆంక్షలను విధించింది. అప్పట్లో దిగుమతులపై విధించిన ఆంక్షల్లో 80:20 నిబంధన ఒకటి. ఈ నిబంధనను 2014 నవంబర్ 28న కేంద్రం తొలగించింది.
దీని ప్రకారం కొత్త లాట్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముందు, అప్పటికే దిగుమతి చేసుకున్న బంగారంలో 20 శాతాన్ని తప్పనిసరిగా ఎగుమతి చేయాలి. కాగా ఈ నిబంధన రద్దయినప్పటికీ, నవంబర్ 28ని ముందు దిగుమతి చేసుకున్న బంగారం నిల్వలకు సంబంధించి, ఎగుమతుల నిబంధనను (20% తప్పనిసరిగా ఎగుమతి) ఇప్పటికీ తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఆర్‌బీఐ తాజాగా పేర్కొంది.