సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక బోర్డు సమావేశం సోమవారం ప్రారంభమైంది. ప్రతిపక్షాలు, ఆర్థిక నిపుణులతో పాటు యావద్దేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రస్తుత బోర్డు మీటింగ్‌లో ఆర్‌బీఐ, ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం జరిగినట్టు తెలిసింది. అయితే ఇరువురికి సమ్మతమైన ఒక అంగీకారానికి రావచ్చనే అంచనాలు నెలకొన్నాయి. మిగులు నిధుల బదిలీ, మొండి బకాయిల నిబంధనలను మార్చాలన్న డిమాండ్లు ప్రధానంగా చర్చకు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సుదీర్ఘంగా సాగుతున్న చర్చలు రేపు ఉదయం దాకా కొనసాగనుందని తెలుస్తోంది. కేంద్ర బ్యాంకుతో కేంద్రానికి గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్‌బీఐ వద్ద ఉన్న 9లక్షల కోట్లు రూపాయల నిధుల్లో మూడోవంతు నిల్వలను (దాదాపు రూ.3.6 లక్షల కోట్లు) ప్రభుత్వం కోరుతోంది.
మొత్తం బోర్డు హాజరు
మొత్తం 18మంది బోర్డు సభ్యులు ఈ సమావేశానికి హాజరు కావడం విశేషం. మొత్తం 18మందిలో గవర్నర్ ఊర్జిత్ పటేల్, విశ్వనాథన్, విరాల్ ఆచార్య, బిపీ కనుంగో, ఎంకే జైన్ డిప్యూటీ గవర్నర్లుగా ఉండగా, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్‌సీ గార్గ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శి రాజీవ్ కుమార్, ఎస్ గురుమూర్తి, సతీష్ మరాథే తదితరులు ఇందులో ఉన్నారు.
సామరస్యంగా కొనసాగుతున్న చర్చలు
సమస్యలు పరిష్కరించుకునేందుకు అటు ఆర్‌బీఐ, ఇటు ప్రభుత్వం నుంచి ప్రయత్నాలు బీజం పడిన సందర్భంలో ప్రధానంగా ఆర్‌బీఐ వద్ద ఉన్న మిగులు నిల్వలపై తీవ్ర చర్చ జరిగిందట. అయితే కీలక సమస్యలపై వివాదాలు జరిగినప్పటికీ ఎన్నికల ఏడాది కావడంతో చిన్న, మధ్యస్థాయి సంస్థ (ఎస్‌ఎంఈ) లకు ఇచ్చే రుణ నిబంధనలు సులభరం, సత్వర పరిష్కార సమితి( పీసీఏ) నిబంధలను సరళీకరణ, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు(ఎన్‌బీఎఫ్‌సీ) ద్రవ్య లభ్యత తదితర అంశాలపై సానుకూలమైన పరిష్కారం లభించవచ్చని భావిస్తున్నారు.
చర్చల్లో ఉన్న సమస్యలు
ప్రధానంగా మిగులు నిధుల బదిలీ, మొండి బకాయిల నిబంధనల సరళీకరణ,షాడో బ్యాంకింగ్‌రంగంలో ద్రవ్యలభ్యత ఉండేలా చూడటం తదితర అంశాలపై చర్చలు భారీగా జరుగుతున్నట్టు సమాచారం. కేంద్రం ఆర్‌బీఐ మధ్య వివాదం ఎడతెగకుండా కొనసాగితే ఇండిపెండెంట్ డైరెక్టర్లు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కాగా ఆర్‌బీఐకు స్వతంత్రత ఉండాలంటూ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య చేసిన వ్యాఖ్యలతో కేంద్ర బ్యాంకు, ప్రభుత్వం మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయన్న వార్తలు వ్యాపించాయి. ఆర్‌బీఐపై పట్టు సాధించేందుకు ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్-7ను ఆయుధాన్ని వాడనుందన్న అంచనాలు కూడా భారీగా వ్యాపించాయి.కొత్తగా నియమితులైన స్వామినాథన్ గురుమూర్తి ఆర్బీఐ కేంద్రం సూచనల మేరకు నడుచుకోవాల్సిందేనంటూ వివాదస్పద వాఖ్యలు అగ్నికి అజ్యం పోసిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ రాజీనామా అవకాశాలున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. మరోవైపు ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య రాజీనామా చేస్తారనే అంచనాల నేపథ్యంలో తాజా బోర్డు మీటింగులో వారిద్దరూ రాజీనామా సమర్పించకపోవడం, చర్చల్లో చురుకుగా పాల్గొనడం ఆహ్వానించదగ్గ పరిణామంగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment