6 మెట్రో నగరాల్లో...ఇక ఏటీఎం చార్జీల మోత
ముంబై: మెట్రోపాలిటన్ నగరాల్లో ఏటీఎంల వినియోగంపై చార్జీల మోత మోగనుంది. హైదరాబాద్ సహా ఆరు మెట్రోపాలిటన్ నగరాల్లో నవంబర్ నుంచి ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిని కుదించాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి ఇకపై నెలకు 5 లావాదేవీలు మాత్రమే ఉచితం. అదే మరో బ్యాంకు ఏటీఎంలోనైతే ఈ పరిమితిని ప్రస్తుతమున్న 5 నుంచి 3కు తగ్గించనున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది.
నగదు విత్‌డ్రాయల్స్ మొదలుకుని బ్యాలెన్స్ స్టేట్‌మెంట్ల లావాదేవీల దాకా అన్నీ ఈ పరిమితికి లోబడే ఉండాలి. ఒకవేళ దాటితే ప్రతి లావాదేవీకి గరిష్టంగా రూ. 20 మేర చార్జీలు పడతాయి. అయితే, చెక్‌బుక్కులు తదితర అదనపు సర్వీసులు ఉండని బేసిక్ సేవింగ్స్ ఖాతాలకు వీటి నుంచి మినహాయింపు ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. మిగిలిన చోట్ల ఇతర ఏటీఎంల వాడకంపై ప్రస్తుతమున్న ఐదు లావాదేవీల పరిమితి యథాప్రకారం కొనసాగుతుంది.
ఈ ఏడాది మార్చి దాకా అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 1.6 లక్షల ఏటీఎంలు ఉన్నాయి. అయితే ఏటీఎంల ఏర్పాటు, ఉచిత లావాదేవీల వల్ల నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగిపోతున్నాయని బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయాన్ని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్.. త న దృష్టికి తీసుకురావడంతో ఆర్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. నిర్దేశిత పరిమితులను, కొత్త చార్జీలను గురించి ఖాతాదారులకు పారదర్శకంగా తెలియజేయాలని బ్యాంకులకు సూచిం చింది.
అలాగే, ఈ విషయంలో ఖాతాదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండాను, ఫిర్యాదులు తలెత్తకుండా చూసేందుకు వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఖాతాదారుల సౌలభ్యం కోసం వారు వినియోగిస్తున్న ఏటీఎం మెట్రో పరిధిలో ఉందా లేక నాన్-మెట్రో పరిధిలో ఉందా అన్నది స్పష్టంగా తెలిసేలా తగిన ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. అలా గే వినియోగించుకున్న ఉచిత లావాదేవీల సంఖ్యను విధించబోయే చార్జీలను కస్టమర్లకు తెలియచేయాలి.