సాక్షి,ముంబై: ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) భారీ జరిమానా విధించింది. నో యువర్ కస్టమర్ (కెవైసీ) నిబంధనలను పాటించలేదని ఆరోపిస్తూ కోటి రూపాయల జరిమానా విధించింది. 39 ఖాతాలు కేవైసీ రూల్స్‌ను అతిక్రమించాయని ఆర్‌బీఐ పేర్కొంది. దీంతో సెక్షన్ 47 ఎ (1) (సి) బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 లోని సెక్షన్ 46 (4) (ఐ) ఆర్‌బీఐ జారీ చేసిన ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
మార్చి 31, 2017 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి హెచ్‌డీఎఫ్‌సీ ఆన్-సైట్ తనిఖీ సందర్భంగా ఆర్‌బీఐ లోపాలను గుర్తించింది. ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌లో బిడ్డింగ్ కోసం వినియోగదారులు తెరిచిన 39 కరెంట్ ఖాతాల పరిశీలన జరిగిందని, ఈ ఖాతాల్లో కేవైసీ నిబంధనలు పాటించడంలో బ్యాంకు విఫలమైందని ఆర్‌బీఐ తెలిపింది. ఈ కరెంట్ ఖాతాలలో జరిపిన లావాదేవీలు, వారి ఆదాయం, ప్రొఫైల్‌కు సరితూగలేదని గుర్తించినట్టు తెలిపింది. అనంతరం జరిమానా విధింపుపై బ్యాంకునకు ఆర్‌బీఐ నోటీసు జారీ చేసింది. దీనికి బ్యాంకు జవాబును పరిశీలించిన తరువాత, ద్రవ్య జరిమానా విధించాల్సిన అవసరం ఉందని నిర్ధారణకు వచ్చినట్టు ఆర్‌బీఐ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment