
ముంబై: పెరుగుతున్న చమురు ధరలు, ఇతర అంశాల నేపథ్యంలో ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ మానిటరీ పాలసీ (ఎంపీసీ) కమిటీ సంచలనాలకు పోకుండా సాదాసీదాగా ద్రవ్యపరపతి విధాన సమీక్షను ముగించేసింది. వడ్డీ రేట్లు తగ్గించాలన్న ప్రభుత్వ, పరిశ్రమ డిమాండ్లను ప్రస్తుతానికి పక్కనపెట్టేసి కఠిన విధానానికే కట్టుబడింది. కీలకమైన రెపో రేటును 6 శాతంగా, రివర్స్ రెపోను 5.75 శాతంగా కొనసాగిస్తూ తాజా నిర్ణయాలను ప్రకటించింది. దీంతో రుణాలపై వడ్డీ రేట్లు మరింత తగ్గే అవకాశాలకు దాదాపుగా తలుపులు మూసుకున్నట్టే అయింది. సెప్టెంబర్ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతంగానే నమోదు కాగా, పూర్తి ఆర్థిక సంవత్సరానికి 6.7 శాతంగా ఉండొచ్చన్న గత అంచనాలకే ఆర్‌బీఐ కట్టుబడి ఉంది. ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో మంగళ, బుధవారాల్లో జరిగిన ఎంపీసీ సమావేశం ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. ఆరుగురు సభ్యుల్లో రవీంద్ర హెచ్ డోలాకియా మాత్రం రెపో రేటును పావుశాతం తగ్గింపునకు ఓటేశారు. వృద్ధికి మద్దతుగా ఉండేందుకు గాను మధ్య కాలానికి వినియోగ ధరల ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి (ప్లస్ లేదా మైనస్ 2) పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని సాధించడమే తాజా నిర్ణయాల వెనుకనున్న ఉద్దేశంగా ఆర్‌బీఐ పేర్కొంది.
ద్రవ్యోల్బణానికే ప్రథమ ప్రాధాన్యం
ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యానికే ఆర్‌బీఐ కట్టుబడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధానికి ద్రవ్యోల్బణం 4.3–4.7 శాతంగా ఉండొచ్చని తెలిపింది. ద్రవ్యోల్బణం అక్టోబర్–మార్చి కాలానికి 4.2–4.6 శాతంగానే ఉండొచ్చన్న అంచనాలను అక్టోబర్‌లో జరిగిన పాలసీ సమావేశంలో ఆర్‌బీఐ వ్యక్తం చేసింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరలు, ఏడో వేతన కమిషన్ సిఫారసులతో ద్రవ్యోల్బణంపై పడే ఒత్తిళ్లను పరిగణనలోకి తీసుకుని తాజాగా సవరణలు చేసింది.
జీడీపీ వృద్ధి 6.7 శాతం
జీడీపీ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతంగానే ఉంటుందన్న అంచనాలను ఆర్‌బీఐ మార్చలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో వృద్ధి 5.7 శాతంతో మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోగా, రెండో క్వార్టర్లో 6.3 శాతంగా ఉంది. రెండో క్వార్టర్లో వృద్ధి రేటు గత అక్టోబర్ సమావేశంలో వేసిన అంచనాల కంటే తక్కువగా ఉండడానికి ఇటీవలే పెరిగిన చమురు ధరల ప్రభావం కంపెనీల మార్జిన్లపై, గ్రాస్ వ్యాల్యూ యాడెడ్(జీవీఏ)పై ప్రభావం చూపి ఉండొచ్చని ఆర్‌బీఐ పేర్కొంది. రియల్ ఎస్టేట్ రంగంలో మందగమనం ఉన్నప్పటికీ, సేవలు, ఇన్‌ఫ్రా రంగాల్లో డిమాండ్ పుంజుకోవచ్చని పేర్కొంది.
డెబిట్ కార్డు లావాదేవీలకు బూస్ట్!
డిజిటల్ చెల్లింపులను మరింతగా పెంచే దిశగా ఆర్‌బీఐ డెబిట్ కార్డు లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)లో మార్పులు చేసింది. చిన్న, పెద్ద వర్తకులకు వేర్వేరుగా రేట్లను నిర్ణయించింది. డెబిట్, క్రెడిట్ కార్డు సేవలకు గాను వర్తకుల నుంచి బ్యాంకులు వసూలు చేసే చార్జీనే ఎండీఆర్‌గా వ్యవహరిస్తారు. వార్షిక టర్నోవర్ రూ.20లక్షల్లోపు ఉన్న వర్తకులకు ఎండీఆర్ చార్జీని 0.40 శాతంగా ఖరారు చేసింది. వార్షిక టర్నోవర్ రూ.20 లక్షలకు మించి ఉన్న వ్యాపారులకు ఎండీఆర్ చార్జీలు లావాదేవీ విలువలో 0.90 శాతంగా ఉంటాయి.
ద్రవ్యోల్బణం... మోడీ ప్రభుత్వానికి ఇప్పుడిదే పరీక్ష!
2014 మే నెలలో మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వినియోగ సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం భారీగానే 8.33 శాతంగా ఉండేది. 2017 జూన్ నాటికి ఏకంగా 1.54 శాతం స్థాయికి పడిపోయింది. ఇదే కాలంలో ఆహార ద్రవ్యోల్బణం 8.89 స్థాయి నుంచి 0.61 శాతానికి చేరువయ్యింది. అంతర్జాతీయంగా చమురు ధరలు ఈ ఏడాది భారీగా పడిపోవడం దీనికి కారణం. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక దశలో బ్రెంట్ క్రూడ్ బేరల్ ధర 44.50 డాలర్ల దిగువ స్థాయిని సైతం చూసింది. ఈ దన్నుతో ప్రభుత్వం ధరల కట్టడికి తీసుకుంటున్న చర్యలూ ఫలించాయి. 2 ప్లస్ లేదా మైనస్‌తో 4 శాతం వద్ద ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలని ప్రభుత్వం, ఆర్‌బీఐ నిర్దేశించుకున్నాయి. ఆయా అంశాల నేపథ్యంలో... ఆర్‌బీఐ రెపో రేటును 2017 ఆగస్టు నాటికి ఏడేళ్ల కనిష్ట స్థాయి 6 శాతానికి తగ్గించింది. ఇప్పుడు మళ్లీ పరిస్థితి మారిపోయింది. క్రూడ్ ధర మూడేళ్ల గరిష్ట స్థాయిలను (64.65 డాలర్లు) చూస్తున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే, ఇకపై మోదీ సర్కారుకు ఇది పెద్ద పరీక్షే. ద్రవ్యోల్బణం భయాలతో ఇప్పుడు ఆర్‌బీఐ రేట్ల తగ్గింపుకు నో అంటోంది. ఈ విషయంలో ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాల ఒత్తిడికీ తలొగ్గడం లేదు. అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం ఏడు నెలల కనిష్ట స్థాయి 3.58 శాతంగా నమోదయ్యింది. వచ్చే ఆరు నెలల్లో 4.7 శాతం వరకూ పెరుగుతుందన్నది ఆర్‌బీఐ తాజా అంచనా.
వృద్ధికి మెరుగైన అవకాశాలు: పటేల్
సాధారణంగా సీజన్ వారీ ఆహార ధరలు మోస్తరు స్థాయిలో ఉండొచ్చని, ఇటీవల తగ్గించిన జీఎస్టీ రేట్లు ఒత్తిళ్లను కొంత మేర తగ్గించొచ్చని ఎంపీసీ భావిస్తోంది. తన తటస్థ విధానాన్ని కొనసాగిస్తూనే ద్రవ్యోల్బణం, వృద్ధిపై వచ్చే గణాంకాలను జాగ్రత్తగా గమనిస్తుంది. ఇటీవలి పరిణామాల (ప్రభుత్వ చర్యలు)తో వృద్ధికి మంచి అవకాశాలున్నాయి’’
– ఉర్జిత్ పటేల్, ఆర్‌బీఐ గవర్నర్
అంచనాలకు అనుగుణంగానే...
దేశీయ బ్యాంకుల విదేశీ సబ్సిడరీలు ఏఏఏ– రేటింగ్ కలిగిన కార్పొరేట్ సంస్థలకు రీఫైనాన్స్ చేసేందుకు అనుమతించడం వల్ల బ్యాంకులు నాణ్యమైన అసెట్స్ (ఖాతాలు)ను నిలబెట్టుకునేందుకు వీలు కల్పిస్తుంది. పాలసీ రేట్లలో మార్పుల్లేకపోవడం అంచనాలకు అనుగుణంగానే ఉంది.
– రజనీష్‌కుమార్, ఎస్‌బీఐ ఎండీ
తగిన నిర్ణయం...
సంస్కరణలు, బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్ వంటి చర్యల కారణంగా వృద్ధి మరింత మెరుగయ్యే అవకాశాలను పరిగణనలోకి తీసుకుంది. లిక్విడిటీ కార్యాచరణపై ఆర్‌బీఐ స్పష్టత స్వాగతించతగ్గది. అవసరమైతే లిక్విడిటీనీ సర్దుబాటు చేసేందుకు, పెంచేందుకు ఆర్‌బీఐ సిద్ధంగా ఉంది’’
– చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో
ముఖ్యాంశాలు
►రెపో రేటు 6 శాతం.
►రివర్స్ రెపో రేటు 5.75 శాతం.
► ద్రవ్యలోటుపై తస్మాత్ జాగ్రత్త...
►2017–18 జీడీపీ వృద్ధి అంచనా 6.7 శాతం.
►ఎంపీసీ నిర్ణయాలకు ఐదుగురు సభ్యులు ఆమోదం తెలుపగా ఒకరు వ్యతిరేకించారు.
► తదుపరి ఆర్‌బీఐ ఎంపీసీ సమీక్షా సమావేశం వచ్చే ఏడాది ఫిబ్రవరి 6, 7 తేదీల్లో జరగనుంది.