వడ్డీరేట్లు మరింత తగ్గుతాయి: కేంద్రం
న్యూఢిల్లీ: భారత్ దిగువ స్థాయి వడ్డీరేట్ల బాటలో నడుస్తున్నదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ శుక్రవారం పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవలే రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.5 శాతం)ను పావుశాతం తగ్గించిన నేపథ్యంలో- బ్యాం కులు రానున్న కొద్ది రోజుల్లోనే ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించనున్నాయని అన్నారు.
ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య వ్యత్యాసం)ను లక్ష్యాల మేరకు 3.5 శాతం (2016-17 జీడీపీలో) కట్టడిలో ఉంచుతామని, చిన్న పొదుపు మొత్తాల రేట్లను తగ్గించి వ్యవస్థను దిగువస్థాయి రేట్ల దిశగా తీసుకువెళతామని ప్రభుత్వం పటిష్ట సంకేతాలు ఇస్తోందని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్) విధానానికి బ్యాంకింగ్ ఇప్పటికే శ్రీకారం చుట్టిన విషయాన్ని ప్రస్తావించారు.