
ముంబై : కోవిడ్-19 భవిష్యత్‌లో ఆర్థిక వ్యవస్థను వెంటాడే ముప్పు వంటిదేనని ఆర్‌బీఐ పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థపై లాక్‌డౌన్ ప్రభావం నేరుగా ఉంటుందని స్పష్టం చేసింది. అంతర్జాతీయ స్ధూల ఆర్థిక పరిస్థితులను కరోనా మహమ్మారి తారుమారు చేసిందని పేర్కొంది. అంతర్జాతీయ ఉత్పాదకత, సరఫరా వ్యవస్థలు, వర్తకం, పర్యాటక రంగానికి తీవ్ర ఆటంకాలు ఎదురవుతాయని కేంద్ర బ్యాంక్ వెల్లడించిన ద్రవ్య విధాన నివేదికలో పేర్కొంది.
కరోనా కట్టడికి విధించిన మూడు వారాల లాక్‌డౌన్ 16వ రోజులో అడుగుపెట్టిన క్రమంలో ఆర్‌బీఐ నివేదిక విడుదలైంది. ఇప్పటికే మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ లాక్‌డౌన్‌తో మరింత దిగజారింది. కోవిడ్-19 వ్యాప్తికి ముందు 2020-21లో వృద్ధిరేటు రికవరీ ఆశాజనకంగా ఉండగా మహమ్మారి ప్రభావంతో ఇది తారుమారైందని ఆర్‌బీఐ పేర్కొంది. కరోనా మహమ్మారి వ్యాప్తి, దాని తీవ్రతను అంచనా వేస్తున్నామని..లాక్‌డౌన్‌ల కారణంగా 2020లో ప్రపంచ ఉత్పాదకత పడిపోవడం వృద్ధి అంచనాలపై పెనుప్రభావం చూపుతుందని ఆర్‌బీఐ తెలిపింది.
2019-20లో భారత వృద్ధి రేటు 5 శాతం ఉంటుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రియల్ జీడీపీ వృద్ధి రేటు 5.5 శాతంగా ఆర్‌బీఐ అంచనా వేసింది. ద్రవ్యోల్బణం రాబోయే రోజుల్లో తమ అంచనాలకు లోబడే ఉంటుందని పేర్కొంది. 2020 కేలండర్ సంవత్సరంలో కోవిడ్-19 ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశిస్తుందని ఆర్‌బీఐ హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment