సుప్రీం కోర్టుకు డిఫాల్టర్ల జాబితా
పేర్లు బహిర్గతం చేయొద్దని ఆర్‌బీఐ వినతి
న్యూఢిల్లీ: భారీగా తీసుకున్న రుణాల చెల్లింపులో డిఫాల్ట్ అయిన సంస్థల జాబితాను రిజర్వ్ బ్యాంక్ .. సుప్రీం కోర్టుకు సీల్డ్ కవర్‌లో అందజేసింది. అయితే, ఆయా సంస్థలపై ప్రతికూల ప్రభావం పడి, వ్యాపారాలు మరింత దిగజారే ప్రమాదమున్నందున పేర్లను బహిర్గతం చేయొద్దని కోరింది. తిరిగి చెల్లించలేకపోవడానికి కారణాలను పక్కన పెట్టి కేవలం డిఫాల్ట్ అయ్యిందనే ఏకైక ఉద్దేశంతో పేర్లు బైటపెట్టిన పక్షంలో ఆయా సంస్థలు కోలుకునే అవకాశాలున్నా నష్టపోయే ముప్పు ఉందని అఫిడవిట్‌లో ఆర్‌బీఐ పేర్కొంది. ఫలితంగా వాటిల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీవనోపాధిపైనా ప్రతికూల ప్రభావం పడగలదని వివరించింది. మొండిబకాయిలు అంతకంతకూ పెరిగిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ సారథ్యంలోని బెంచ్ ..
దాదాపు రూ. 500 కోట్ల పైగా బ్యాంకు రుణాలను ఎగవేసిన డిఫాల్టర్ల జాబితా ఇమ్మంటూ గత నెలలో ఆర్‌బీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే. కార్పొరేట్ రుణ పునర్‌వ్యవస్థీకరణ పథకాల కింద రుణాలు రీకన్‌స్ట్రక్ట్ చేసిన కంపెనీల లిస్టును ఆరు వారాల్లోగా ఇవ్వాలని సూచించింది. సరైన మార్గదర్శకాలు, రికవరీ యంత్రాంగం లేకుండా బ్యాంకులు భారీ మొత్తాల్లో రుణాలెలా ఇచ్చేస్తున్నాయంటూ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలను ప్రశ్నించింది. ప్రభుత్వం.. నియంత్రణ సంస్థల నుంచి అనుమతుల్లో జాప్యాలు, స్థల సమీకరణలో ఆలస్యం, రుణాల మంజూరీలో జాప్యాలు, వ్యాపార పరిస్థితుల్లో మందగమనంతో ప్రాజెక్టులు నిల్చిపోవడం తదితర అంశాలు డిఫాల్టులకు కారణాలవుతున్నాయని ఆర్‌బీఐ తెలిపింది.