
పట్టణీకరణ సమస్యల నివారణకు సంస్కరణలు
భారత పట్టణీకరణ గందరగోళంగా, అయోమయంగా ఉందని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక వెల్లడించింది...
- ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఇంద్రావతి
న్యూఢిల్లీ: భారత పట్టణీకరణ గందరగోళంగా, అయోమయంగా ఉందని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక వెల్లడించింది. పట్టణీకరణ అందించే ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి తగిన సంస్కరణలు చేపట్టాల్సి ఉందని ఈ నివేదిక సూచించింది. పట్టణీకరణ విషయమై ప్రపంచబ్యాంక్ రూపొందించిన ఈ నివేదిక వివరాలను ప్రపంచ బ్యాంక్ ఎండీ, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ముల్యాణి ఇంద్రావతి వెల్లడించారు. పట్టణీకరణ సంస్కరణల విషయంలో భారత్, కొన్ని దక్షిణాసియా దేశాలు కొంత పురోగతిని సాధించాయని పేర్కొన్నారు.
పట్టణీకరణ అందించే అవకాశాలను ఆయా దేశాలు మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటే, వాటి ఆర్థిక పరిస్థితులు మరింతగా మెరుగుపడతాయని వివరించారు. పట్టణాల్లో ప్రజలు పెరగడం వల్ల ప్రాథమిక సర్వీసులు, మౌలిక, భూ, హౌసింగ్, పర్యావరణ సంబంధిత ఒత్తిడులు కూడా బాగా పెరుగుతున్నాయని, వీటిని పరిష్కరించడం కొంత కష్టసాధ్యమేనని తెలిపారు. నగరాల అనుసంధానత, సౌకర్యాల కల్పన, ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులను తట్టుకునేలా నగరాలను పటిష్టం చేయాల్సి ఉందని సూచించారు. భారత్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ నివేదిక వివరాలను ఆమె వెల్లడించారు. పట్టణీకరణ భారత్‌లో మందగించిందని ఆమె పేర్కొన్నారు.