ఎఫ్‌డీఐలకు రెడ్ కార్పెట్.. | Relaxed FDI Norms Red Carpets Ikea and Apple Stores in India | Sakshi
Sakshi News home page

ఎఫ్‌డీఐలకు రెడ్ కార్పెట్..

Published Tue, Jun 21 2016 12:27 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

ఎఫ్‌డీఐలకు రెడ్ కార్పెట్.. - Sakshi

ఎఫ్‌డీఐలకు రెడ్ కార్పెట్..

పౌర విమానయానం,ఆహార రంగంలో 100%కి పెంపు
* రక్షణ, ఫార్మా రంగాల్లో ఎఫ్‌డీఐల నిబంధనలకు సడలింపు
* ఫలించిన యాపిల్ కృషి... దుకాణాల ఏర్పాటుకు తొలగిన అడ్డంకి

న్యూఢిల్లీ: మోదీ సర్కారు మరోమారు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) కు రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. రక్షణ, పౌర విమానయాన, ఫార్మా, సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగాల్లో ఆటోమేటిక్ మార్గంలో మరిన్ని విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ ఎఫ్‌డీఐ నిబంధనలను సరళీకరించింది.

ప్రధాని మోదీ నేతృత్వంలో సోమవారం ఢిల్లీలో జరిగిన అత్యున్నత సమావేశంలో ప్రభుత్వం ఈ మేరకు పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ రెండో విడత ఆ బాధ్యతలు చేపట్టడం లేదంటూ ప్రకటించిన రెండు రోజులకే... వృద్ధి దిశగా సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లే విషయంలో తాము సానుకూలంగానే ఉన్నట్టు మోదీ సర్కారు పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో యాపిల్ కంపెనీ స్టోర్లు ప్రారంభించేందుకు కూడా మార్గం సుగమం అయింది.

ఆహార ఉత్పత్తుల ట్రేడింగ్, శాటిలైట్ ద్వారా నేరుగా ఇంటికే టీవీ ప్రసారాలు అందించే సంస్థల్లో (డీటీహెచ్), కేబుల్ టీవీ ప్రసారాలు, ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు, జంతు, మత్స్య పరిశ్రమల వృద్ధి దిశగా నూరు శాతం ఎఫ్‌డీఐలకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా రంగాల్లో ఆటోమేటిక్ మార్గంలో ఎఫ్‌డీఐలకు సర్కారు ద్వారాలు తెరిచినట్టయింది. తాజా నిర్ణయంతో భారత్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఓపెన్ మార్కెట్‌గా మారిందని ప్రధాని కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది.

అంతేకాదు, దేశంలో ఉద్యోగావకాశాల కల్పన దిశగా ఎఫ్‌డీఐ విధానాన్ని మరింత సరళీకరించాలని ప్రధాని నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. కేంద్రం గతేడాది నవంబర్‌లో ఎఫ్‌డీఐ విధానాన్ని గణనీయంగా సరళీకరించగా.. తాజాగా రెండోసారి అదే స్థాయిలో నిబంధనలను సులభతరం చేస్తూ సంస్కరణలను వేగవంతం చేసింది.
 
ఫార్మా రంగానికి ఊతం

దేశీయ ఫార్మా రంగాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే దిశగా ఆటోమేటిక్ మార్గంలో 74 శాతం ఎఫ్‌డీఐలకు సర్కారు పచ్చజెండా ఊపింది. దీంతో విదేశీ సంస్థలు భారతీయ ఫార్మా కంపెనీల్లో (బ్రౌన్‌ఫీల్డ్) ప్రభుత్వ అనుమతి లేకుండానే ఏకంగా 74 శాతం వాటా వరకూ సొంతం చేసుకోవచ్చు. అంతకుమించి 100 శాతం వరకు వాటాల కొనుగోలుకు మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలి.

ఇంతకుముందు కూడా దేశీయ ఫార్మా కంపెనీల్లో 100 శాతం ఎఫ్‌డీఐలకు అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వ అనుమతి తప్పకుండా తీసుకోవాలనే నిబంధన ఉంది. తాజాగా దాన్ని ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఇక గ్రీన్ ఫీల్డ్ ఫార్మా (నూతనంగా ఏర్పాటు చేసే) కంపెనీల్లో ఆటోమేటిక్ మార్గంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు గతంలోనే ప్రభుత్వం అనుమతించింది. దేశీయ ఫార్మా కంపెనీలను విదేశీ కంపెనీలు హస్తగతం చేసుకుంటుండడంతో ఇప్పటికే ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆటోమేటిక్ మార్గంలో ప్రభుత్వం 74 శాతం వరకు దారులు తెరిచింది.
 
ఆహార ఉత్పత్తుల ట్రేడింగ్‌లో 100 శాతం ఎఫ్‌డీఐ
ఈ కామర్స్ వేదికలు సహా ఇతర మార్గాల్లో ఆహారోత్పత్తుల ట్రేడింగ్‌కు సంబంధించి కూడా నూరు శాతం ఎఫ్‌డీఐలకు సర్కారు ద్వారాలు తెరిచింది. ఇందుకు గాను ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 2012 ఏప్రిల్ నుంచి 2015 డిసెంబర్ మధ్య దేశీయ ఆహారశుద్ధి రంగం 528 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలను ఆకర్షించిన విషయం గమనార్హం.
 
రక్షణలో ఆధునికత
రక్షణ రంగంలో 49 శాతానికి మించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతించడం అన్నది ప్రస్తుతం ఆయా ప్రతిపాదనలపై ఆధారపడి ఉంది. ఈ నిబంధనల్లో ప్రభుత్వం తాజాగా మార్పులు చేసింది. అత్యాధునిక, ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలోకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించినది అయితే, ప్రభుత్వం అనుమతితో భారత కంపెనీలతో కలసి సంయుక్త భాగస్వామ్య కంపెనీలో 49 శాతానికి మించి  ఎఫ్‌డీఐలకు అవకాశం కల్పించింది. దేశీయ చిన్నతరహా ఆయుధాలు, మందుగుండు సామగ్రి కంపెనీలకు కూడా ఈ అవకాశం కల్పించింది.
 
పౌర విమానయానంలో నూరు శాతం ఎఫ్‌డీఐలు..!
దేశీయ విమానయాన సంస్థల్లో విదేశీ సంస్థలు 100% వాటా కొనుగోలుకు మార్గం సుగమం అయింది. షెడ్యూల్డ్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ (ప్రయాణ, కార్గో సేవలు అందించేవి)/ దేశీయ షెడ్యూల్డ్ పౌర విమానయాన సేవల కంపెనీలు, ప్రాంతీయ విమాన సేవల సంస్థల్లో 100% ఎఫ్‌డీఐలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే, విదేశీ విమానయాన కంపెనీలకు ఈ అవకాశం లేదు. వేరే రంగాలకు చెందిన కంపెనీలకే ఈ వెసులుబాటు కల్పించారు. 49% ఆటోమేటిక్ మార్గంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. అంతకు మించితే మాత్రం ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ షెడ్యూల్డ్ విమానయాన సేవల్లో 49% వరకే ఎఫ్‌డీఐలకు అవకాశం ఉంది.
 
డీటీహెచ్, కేబుల్ టీవీల్లో...
ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీల్లో ఇప్పటి వరకు 49 శాతం ప్రభుత్వ అనుమతితో ఎఫ్‌డీఐలకు అవకాశం ఉంది. దీన్ని ఆటోమేటిక్ విధానంలో74 శాతం వరకు పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆటోమేటిక్ మార్గంలో టెలివిజన్ ప్రసారాల సేవల విభాగాల్లోనూ 100 శాతం ఎఫ్‌డీఐలకు సర్కారు అనుమతించింది.

డీటీహెచ్, కేబుల్ నెట్‌వర్క్‌లు, మొబైల్‌టీవీలు, టెలిపోర్టుల సేవల్లో 49 శాతానికి మించి తాజాగా చేసే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధిత శాఖ అనుమతి గానీ, లెసైన్స్ గానీ అవసరం లేదని సర్కారు స్పష్టం చేసింది. అయితే, యాజమాన్యం చేతులు మారుతున్నా, ప్రస్తుత వాటాదారు నుంచి ఆ వాటా విదేశీ పెట్టుబడిదారుడి చేతికి వెళుతున్నా ఎఫ్‌ఐపీబీ అనుమతి తీసుకోవాలని పేర్కొంది. రక్షణ, టెలికామ్, ప్రైవేటు సెక్యూరిటీ లేదా సమాచార ప్రసారాలకు సంబంధించిన వ్యవహారాల్లో విదేశీ కంపెనీలు శాఖల ఏర్పాటుకు భద్రతా పరమైన క్లియరెన్స్ లేదా ఆర్‌బీఐ అనుమతి తీసుకోవాలన్న నిబంధన ప్రస్తుతం ఉంది. దీని స్థానంలో ఎఫ్‌ఐపీబీ లేదా సంబంధిత శాఖ లేదా నియంత్రణ సంస్థల అనుమతిని అమల్లోకి తీసుకురానుంది. జంతు సంరక్షణ రంగానికి సంబంధించి కఠిన నియంత్రణలనూ పక్కన పెట్టాలని సర్కారు నిర్ణయించింది.
 
యాపిల్ స్టోర్లకు లైన్ క్లియర్
యాపిల్ తన సొంత దుకాణాలను భారతీయ మార్కెట్లో ప్రారంభించేందుకు వీలుగా కేంద్రం సింగిల్ బ్రాండ్ రిటైల్ నిబంధనలను సడలించింది. దేశంలో సింగిల్ బ్రాండ్ (ఒకే బ్రాండ్ పేరుతో దుకాణాలు) పేరుతో ఏర్పాటు చేసే దుకాణాలు స్థానికంగానే 30 శాతం వరకు ముడిసరుకులు సమకూర్చుకోవాలన్న నిబంధనకు మూడేళ్ల మినహాయింపు కల్పించింది. అలాగే, స్టేట్ ఆఫ్ ఆర్ట్, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీల (ప్రత్యేకమైన సాంకేతికతతో ఉన్నవి)కు ఐదేళ్ల సడలింపు ఇచ్చింది.

తమ ఉత్పత్తులు అత్యున్నత సాంకేతికతతో కూడినవని, స్థానికంగానే ముడిసరుకులు సమకూర్చుకోవాలనే నిబంధనను సడలించాలంటూ యాపిల్ కొంతకాలంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. యాపిల్ సీఈవో టిమ్‌కుక్ ఇటీవల భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతోనూ ఇదే విషయమై చర్చలు జరిపారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో యాపిల్ సహా ఇతర విదేశీ రిటెయిల్ కంపెనీలు భారత్‌లో స్టోర్లను ప్రారంభించేందుకు మార్గం సుగమం అయింది.
 
ఉద్యోగాల సృష్టికే...
ప్రభుత్వ తాజా ప్రయత్నాల వల్ల ప్రపంచంలో ఎఫ్‌డీఐలకు మరింతగా ద్వారాలు తెరిచిన ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపొందుతుంది. వ్యాపార నిర్వహణ సులభతరం అవుతుంది. దేశంలో ఉద్యోగాలు సృష్టించాలనే దృష్టితో ప్రభుత్వం విప్లవాత్మకంగా ఎఫ్‌డీఐ విధానాన్ని సరళీకృతం చేస్తూ నిర్ణయం తీసుకుంది.
 - ట్విట్టర్‌లో ప్రధాని మోదీ
 
రెగ్జిట్‌తో సంబంధం లేదు...
రాజన్ ఆర్‌బీఐని వీడి వెళుతున్నందున తీసుకున్న నిర్ణయాలు కావు ఇవి. ఎఫ్‌డీఐ సంస్కరణలపై కొన్ని నెల లుగా కార్యాచరణ జరిగింది. ఈ పనంతా ఒక్కరోజులో పూర్తి అవుతుందా?
- వాణిజ్య మంత్రి, నిర్మలా సీతారామన్
 
పెట్టుబడుల ఆకర్షణ...
పౌరవిమానయానం, ఫార్మా, రక్షణ, సింగిల్ బ్రాం డ్ రిటైల్ రంగాల్లో ఎఫ్‌డీఐ నిబంధనలను సరళీకరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు ఉద్యోగాల సృష్టికి వీలు కల్పిస్తుంది.
- చంద్రజిత్ బెనర్జీ, డైరక్టర్, సీఐఐ
 
ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం...
పౌరవిమానయానం, రక్షణ రంగాల్లో ఎఫ్‌డీఐ నిబంధనల సరళీకరణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో సానుకూలం.
- దిదార్ సింగ్, సెక్రటరీ జనరల్, ఫిక్కీ
 
రక్షణ రంగానికి ఊపు...
రక్షణ రంగంలోకి అత్యాధునిక సాంకేతికతను, పెట్టుబడులను తీసుకొచ్చేందుకు  నిర్ణయాలు ఉపకరిస్తాయి.
- డీఎస్ రావత్, సెక్రటరీ జనరల్, అసోచామ్
 
రాజనే కారణం...
ఎఫ్‌డీఐల విషయంలో కేం ద్రం నిర్ణయాలు భయాందోళన కారణంగా తీసుకున్నవే.  రాజన్ ప్రకటన రాకుంటే ప్రభుత్వం నుంచి కూడా ఈ నిర్ణయాలు వచ్చి ఉండేవి కావు.
- జైరాం రమేశ్, కేంద్ర మాజీ మంత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement