
ఉద్యోగులకు ముకేశ్ నాలుగు ‘సి’ల ‘ఉపదేశం’
న్యూఢిల్లీ : త్వరలో టెలికం కార్యకలాపాలు ప్రారంభించనున్న నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ.. కంపెనీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు చేరువయ్యే క్రమంలో ఉద్యోగుల వ్యవహారశైలి మారాల్సి ఉంటుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సమావేశంలో అంబానీ పేర్కొన్నట్లు సమాచారం. రిలయన్స్ ఇండస్ట్రీస్ తొలుత బి2బి కంపెనీగా వ్యాపారాన్ని విస్తరించిందని, అటుతర్వాత బి2సి కంపెనీగా రూపొందిందని, ఇక సి2సి కంపెనీగా రూపాంతరం చెందాల్సివుందని ఆయన ఎగ్జిక్యూటివ్‌లకు ఉద్బోధించారు.
ఇందుకోసం నాలుగు ‘సి’ల (ఆంగ్ల అక్షరం) వ్యూహాన్ని అనుసరించాల్సి ఉంటుందని ఆయన సూచించారు. దీనికి.. ఆంగ్ల అక్షరం సి తో మొదలయ్యే పదాలను ఉటంకిస్తూ.. కన్ఫ్యూజన్ (గందరగోళం) స్థానంలో క్లారిటీ (స్పష్టత), కన్సర్న్ (ఆందోళన) స్థానంలో కాన్ఫిడెన్స్ (ఆత్మవిశ్వాసం) పెంపొందించుకోవాలని పేర్కొన్నారు.