గిట్టుబాటుకాని గ్యాస్ బావుల వ్యయాల్ని రిలయన్స్ వసూలు చేసుకోవొచ్చు: పీఏసీ
న్యూఢిల్లీ: గిట్టుబాటుకాని గ్యాస్ బావుల తవ్వకానికి అయిన వ్యయాల్ని కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) వసూలు చేసుకోవొచ్చని పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్‌కు కమిటీ (పీఏసీ) సిఫార్సుచేసింది. ఈ అంశంపై గతంలో కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) అభిప్రాయానికి భిన్నమైన నిర్ణయాన్ని పీఏసీ తీసుకోవడం విశేషం. కృష్ణ గోదావరి బేసిన్లో కేజీ-డీ6 బ్లాక్‌లో రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం ఈ బ్లాక్ ప్రాంతాన్నంతటినీ ఆర్‌ఐఎల్ అట్టిపెట్టుకునేలా డెరైక్టర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) అనుమతించినందున, వ్యయాల రికవరీకి రిలయన్స్ అర్హమవుతుందని కమిటీ అభిప్రాయపడింది.
2001లో గ్యాస్ నిక్షేపాల్ని కనుగొన్న ఈ కేజీ-డీ6 బ్లాక్‌లో 7,645 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్నీ రిలయన్స్ అట్టిపెట్టుకునే వీలును చమురు మంత్రిత్వశాఖ, డీజీహెచ్‌లు కల్పించాయి. ఉత్పత్తి షేరింగ్ కాంట్రాక్టు ప్రకారం ఈ ప్రాంతంలో తవ్విన బావుల్లో గ్యాస్ ఉత్పత్తికి గిట్టుబాటుకాకపోయినా, ఇతర బావుల్లోంచి వచ్చిన చమురు, గ్యాస్‌ల ఆదాయం నుంచి వ్యయాలన్నింటినీ కాంట్రాక్టరు తీసుకోవొచ్చు. గిట్టుబాటుకాని, ఉత్పత్తికి వీలుకాని బావుల తవ్వకానికి సంబంధించిన వ్యయాల్ని పొందేందుకు కాంట్రాక్టరును అనుమతించరాదని గతంలో కాగ్ ప్రభుత్వానికి సిఫార్సుచేసింది. ఈ నేపథ్యంలో పీఏసీ ఇచ్చిన నివేదికను తాజాగా పార్లమెంటుకు సమర్పించారు.