
ముంబై: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) మరోసారి రికార్డుల లాభాలతో అదరగొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(2018–19, క్యూ1)లో కంపెనీ కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభం రూ.9,459 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.9,108 కోట్ల పోలిస్తే 4 శాతం మేర వృద్ధి నమోదైంది. ఒక క్వార్టర్‌లో కంపెనీ సాధించిన అత్యధిక నికర లాభం ఇదే. కాగా, క్రితం ఏడాది తొలి త్రైమాసికంలో గల్ఫ్ ఆఫ్రికా పెట్రోలియం కార్పొరేషన్ వాటా విక్రయం ద్వారా కంపెనీకి రూ.1,087 కోట్ల అసాధారణ ఆదాయం లభించింది. దీన్ని కలపకుండా చూస్తే లాభం రూ.7,992 కోట్లు మాత్రమే. అంటే దీంతో పోలిస్తే ఈ ఏడాది క్యూ1లో రిలయన్స్ నికర లాభం 18.6% ఎగబాకినట్లు లెక్క. ఇక కంపెనీ మొత్తం ఆదాయం 56.5 శాతం వృద్ధితో రూ.1.41 లక్షల కోట్లకు దూసుకెళ్లింది. క్రితం ఏడాది క్యూ1లో ఆదాయం రూ.90,537 కోట్లు. ప్రధాన వ్యాపారాల్లో ఒకటైన పెట్రోకెమికల్స్ జోరుతో పాటు రిటైల్ ఇతర అనుబంధ విభాగాలు కూడా భారీ లాభాలతో కొనసాగుతుండటం కంపెనీ మెరుగైన పనితీరుకు దోహదం చేసింది.
జీఆర్‌ఎం తగ్గింది...: చమురు శుద్ధి రంగానికి సంబంధించి స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్‌ఎం) క్యూ1లో 10.5 డాలర్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో జీఆర్‌ఎం 11.9 డాలర్లు కాగా, క్రితం త్రైమాసికంలో(2017–18, క్యూ4) 11 డాలర్లుగా ఉంది. ఒక్కో బ్యారెల్ ముడిచమురు(క్రూడ్)ను శుద్ధి చేసి పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చడం ద్వారా లభించే రాబడిని జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు.
ముఖ్యాంశాలివీ...
►పెట్రోకెమికల్స్ వ్యాపారం స్థూల లాభం క్యూ1లో దాదాపు రెట్టింపయింది. 94.9 శాతం వృద్ధితో రూ.7,857 కోట్లకు దూసుకెళ్లింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో స్థూల లాభం రూ.4,031 కోట్లు.
►మార్జిన్లు తగ్గడంతో రిఫైనింగ్ విభాగం స్థూల లాభం 16.8 శాతం క్షీణించింది. రూ.7,476 కోట్ల నుంచి రూ.5,315 కోట్లకు దిగజారింది.
►చమురు–గ్యాస్ వ్యాపారం నష్టాలు మరింత పెరిగాయి. గతేడాది క్యూ1లో రూ.373 కోట్ల స్థూల నష్టాన్ని చవిచూడగా... ఈ ఏడాది క్యూ1లో నష్టం రూ.447 కోట్లకు పెరిగింది. ముఖ్యంగా కేజీ బేసిన్‌లో ఉత్పత్తి పతనం దీనికి కారణంగా నిలిచింది.
►రిటైల్ వ్యాపారం స్థూల లాభం క్యూ1లో266 శాతం ఎగబాకి రూ.1,069 కోట్లకు చేరింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో స్థూల లాభం 292 కోట్లు మాత్రమే. ఆదాయం రూ.11,571 కోట్ల నుంచి రూ.25,890 కోట్లకు దూసుకెళ్లింది.
►కంపెనీ వద్ద నగదు నిల్వలు ఈ ఏడాది జూన్ చివరినాటికి స్వల్పంగా పెరిగి రూ.79,492 కోట్లకు చేరాయి. ఇక మొత్తం రుణ భారం రూ.2,42,116 కోట్లకు ఎగబాకింది. ఈ ఏడాది మార్చి నాటికి రుణ భారం రూ.2,18,768 కోట్లుగా ఉంది.
►రిలయన్స్ షేరు శుక్రవారం బీఎస్‌ఈలో 1.73 శాతం లాభంతో రూ.1,130 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి.
‘ మా వ్యాపార విభాగాలన్నింటిలో అత్యుత్తమ నిర్వహణ పనితీరును సాధించడంపైనే ప్రధానంగా దృష్టిసారించాం. పెట్రోకెమికల్స్ వ్యాపారం రికార్డు స్థాయి స్థూల లాభాన్ని(ఎబిటా) సాధించింది. పాలియెస్టర్ చైన్‌లో మార్జిన్ల జోరు ఇందుకు ప్రధాన కారణం. ఇటీవలి కాలంలో ఈ రంగంలో మేం చేసిన పెట్టుబడుల ప్రతిఫలమే ఇది. ఇక సీజనల్ బలహీనతలు ఉన్నప్పటికీ... రిఫైనింగ్ వ్యాపార పనితీరు కూడా స్థిరంగానే కొనసాగుతోంది. రిటైల్, ఇతర కన్సూమర్ వ్యాపారాలు కొత్త శిఖరాలను అందుకుంటున్నాయి. రిటైల్ రంగంలో రెట్టింపు ఆదాయం, మూడు రెట్ల ఎబిటాను నమోదు చేశాం. ఇక టెలికం అనుబంధ సంస్థ జియో క్యూ1లో రికార్డు స్థాయిలో వినియోగదారులను జతచేసుకుంది’.
– ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ
జియో జోరు...
ముకేశ్ అంబానీ సంచలన టెలికం వెంచర్ రిలయన్స్ జియో... లాభాల బాటలో దూసుకెళ్తోంది. 2018 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కంపెనీ రూ.612 కోట్ల నికర లాభాన్ని సాధించింది. 2018 జనవరి–మార్చి త్రైమాసికంలో లాభం రూ.510 కోట్లతో పోలిస్తే 20 శాతం ఎగబాకింది. మొత్తం ఆదాయం కూడా 14 శాతం వృద్ధితో 8,109 కోట్లకు చేరింది. ఇక గతేడాది జూన్ క్వార్టర్‌లో కంపెనీ రూ.21.27 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో జియో నికరంగా 2.87 కోట్ల కొత్త కస్టమర్లను చేజిక్కించుకుంది. కంపెనీ వాణిజ్య కార్యకలాపాలు మొదలైన తర్వాత ఒక క్వార్టర్‌లో ఇంత భారీగా యూజర్లు జత కావడం ఇదే తొలిసారి. క్రితం క్వార్టర్‌లో జతైన కొత్త యూజర్ల సంఖ్య 2.65 కోట్లు. సగటున ఒక్కో కస్టమర్ నుంచి ఆదాయం(ఏఆర్‌పీయూ) క్యూ1లో రూ. 134.5గా నమోదైంది. జూన్ నాటికి మొత్తం యూజర్ల సంఖ్య 21.53 కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment