రిలయన్స్‌.. లాభాల రికార్డ్‌ | Reliance Industries records highest-ever net profit at Rs 29901 crore | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌.. లాభాల రికార్డ్‌

Published Mon, Apr 24 2017 11:52 PM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM

రిలయన్స్‌.. లాభాల రికార్డ్‌

రిలయన్స్‌.. లాభాల రికార్డ్‌

క్యూ4లో రూ.8,046 కోట్లు
♦  పెట్రోకెమికల్స్‌ నుంచి అధిక ప్రతిఫలం
♦  2016–17లో లాభం 29,901కోట్లు
♦  కంపెనీ చరిత్రలోనే అత్యధికం
♦  రిలయన్స్‌ రిటైల్‌లోనూ చక్కని వృద్ధి  


న్యూఢిల్లీ/ముంబై: దేశంలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) మరోసారి రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.8,046 కోట్ల కన్సాలిడేటెడ్‌ లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో కంపెనీకి వచ్చిన లాభం రూ.7,167 కోట్లతో పోలిస్తే 12.5 శాతం వృద్ధి నమోదయింది. కంపెనీ ప్రధాన వ్యాపార విభాగమైన పెట్రోకెమికల్స్‌ ఈ స్థాయి లాభాలు ఆర్జించడానికి ప్రముఖంగా దోహదపడింది.

చమురు శుద్ధి మార్జిన్లు ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయిలో ఉండడం కూడా కలసివచ్చింది. కంపెనీ మార్చి త్రైమాసికంలో రూ.92,889 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2015–16 మార్చి క్వార్టర్‌లో వచ్చిన ఆదాయం రూ.63,954 కోట్లతో పోలిస్తే 45% వృద్ధి చెందింది. డిసెంబర్‌ త్రైమాసికంలో ఒక్కో షేరువారీ ఆర్జన రూ.25.5గా ఉండగా, అది మార్చి త్రైమాసికంలో రూ.27.3కు పెరిగింది. 2016–17 పూర్తి ఏడాదికి కంపెనీ  లాభం రూ.29,901 కోట్లుగా ఉంది. కంపెనీ చరిత్రలో ఒక ఏడాదిలో ఈ స్థాయి లాభాలు రావడం ఇదే ప్రథమం. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే లాభం 18.8 శాతం పెరిగింది.

పెట్రో కెమికల్స్‌ జోష్‌...
మార్చి త్రైమాసికంలో పెట్రోకెమికల్స్‌ విభాగం ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ అంతకుముందు ఇదే కాలంతో పోలిస్తే 26 శాతం వృద్ధితో రూ.3,441 కోట్లకు చేరుకుంది. ప్రతి బ్యారల్‌ ముడి చమురును ఇంధనంగా మార్చినందుకు 11.5 డాలర్ల ఆదాయం లభించగా, 2015–16 సంవత్సరం చివరి త్రైమాసికంలో ఇది 10.8 డాలర్లుగానే ఉంది. మొత్తం మీద పెట్రోకెమికల్స్‌ వ్యాపారం ఎబిటా మార్జిన్‌ ఐదేళ్ల గరిష్ట స్థాయి అయిన 14 శాతానికి చేరుకుంది.  

ఆయిల్, గ్యాస్‌ ఉత్పత్తి...
ఈ విభాగంలో కంపెనీ నష్టాలు రెండింతలు పెరిగిపోయాయి. పన్నుకు ముందు ఈ విభాగం నష్టాలు రూ.486 కోట్లకు పెరిగాయి. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో నష్టాలు రూ.153 కోట్లే. ఉత్పత్తి తగ్గడం, దేశీయంగా గ్యాస్‌ ధర తక్కువగా ఉండడం ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది.

రుణాలు, నగదు నిల్వలు
మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ అప్పులు రూ.1,96,601 కోట్లకు పెరిగాయి. డిసెంబర్‌ త్రైమాసికంలో ఇవి రూ.1,94,381 కోట్లుగానే ఉన్నాయి. కంపెనీ వద్ద నగదు నిల్వలు డిసెంబర్‌ త్రైమాసికంలో రూ.76,339 కోట్లుగా ఉండగా, మార్చి త్రైమాసికంలో రూ.77,266 కోట్లకు పెరిగాయి.

జియోకు రూ.22.50 కోట్ల నష్టం
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్‌ జియో ఉచిత సేవల కారణంగా గడచిన ఆరు నెలల కాలంలో రూ.22.50 కోట్ల నష్టాలను చవిచూసింది. గతేడాది అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఎదురైన నష్టం ఇది. ఈ కాలంలో కంపెనీ ప్రమోషనల్‌ ఆఫర్ల పేరిట ఉచితంగా వాయిస్, డేటా సేవలు అందించిన విషయం తెలిసిందే. ప్రైమ్‌ సభ్యత్వం కింద ఖాతాదారుల నుంచి రూ.99 మాత్రమే వసూలు చేసింది. జియో 4జీ సేవలు గతేడాది సెప్టెంబర్‌ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక పూర్తి ఏడాదికి (2016–17) నష్టాలు రూ.31.37 కోట్ల నష్టం వచ్చింది. 10.9 కోట్ల కస్టమర్లు కంపెనీ ఉచిత సేవల కోసం చేరగా, వారిలో 7.2 కోట్ల మంది పెయిడ్‌ చందాదారులుగా మారారు.

రిటైల్‌ లాభం రూ.366 కోట్లు
రిలయన్స్‌ రిటైల్‌ మార్చితో ముగిసిన త్రైమాసికంలో 65.6 శాతం అధికంగా రూ.366 కోట్ల లాభాలను ఆర్జించడం విశేషం. ఆదాయం రూ.10,332 కోట్ల మార్కును చేరుకుంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన ఆదాయం రూ.5,646 కోట్లతో పోలిస్తే 83 శాతం వృద్ధి చెందింది. పూర్తి ఏడాదికి రిలయన్స్‌ రిటైల్‌ ఆదాయం 60 శాతం వృద్ధితో రూ.33,765 కోట్లుగాను, లాభం (వడ్డీ, పన్నులకు ముందు) 40 శాతం పెరుగుదలతో రూ.857 కోట్లుగానూ ఉంది. ఏడాదిలో కంపెనీ 63 కొత్త స్టోర్లను ఏర్పాటు చేసింది.

వృద్ధిని కాపాడుకుంటాం...
2016–17లో రిలయన్స్‌ బృందం కన్జూమర్, ఎనర్జీ, మెటీరియల్స్‌ విభాగాల్లో భవిష్యత్తు వృద్ధికి అవకాశం ఉన్న ప్లాట్‌ఫామ్‌లకు రూపునిచ్చింది. నిర్వహణపరంగా మేము ఎప్పటికప్పుడు కొత్త శిఖరాలను చేరుకుంటున్నాం. ఆర్‌ఐఎల్‌ తన చరిత్రలోనే అత్యధిక వార్షిక లాభం రూ.29,901 కోట్లను 2016–17లో ఆర్జించింది.

రిఫైనింగ్, పెట్రోకెమికల్స్‌ వ్యాపారం రికార్డు స్థాయి లాభాలను నమోదు చేసింది. ప్రపంచ మార్కెట్ల నుంచి ముడి సరుకును పోటీ ధరలకే సమకూర్చుకునే సామర్థ్యం వల్ల అధిక ఆపరేటింగ్‌ మార్జిన్లను కొనసాగిస్తూ మా ఉత్పత్తులను వృద్ధి మార్కెట్లకు అందించగలం. ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టులతో మా ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో మరింత బలోపేతం, సమీకృతం అవుతుంది. దీంతో దీర్ఘకాలానికి లాభాల వృద్ధిని కాపాడుకోగలం. ప్రపంచంలోనే సరసమైన ధరలకు జియో డేటా, వాయిస్‌ సేవలను అందించేందుకు కట్టుబడి ఉంది – ముకేశ్‌ అంబానీ, ఆర్‌ఐఎల్‌ సీఎండీ

మార్కెట్‌ విలువలో ఆర్‌ఐఎల్‌ మళ్లీ నంబర్‌ 1
దేశంలో మార్కెట్‌ విలువ పరంగా ఆర్‌ఐఎల్‌ మరోసారి నంబర్‌ 1 స్థానానికి చేరుకుంది. నాలుగేళ్ల విరామం తర్వాత టీసీఎస్‌ను వెనక్కి నెట్టేసి తిరిగి ఈ స్థానాన్ని దక్కించుకుంది. సోమవారం ఆర్‌ఐఎల్‌ షేరు ముగింపు ధర ప్రకారం మార్కెట్‌ విలువ రూ.4,60,518.80 కోట్లు. టీసీఎస్‌ మార్కెట్‌ విలువ రూ.4,58,932.37 కోట్లు. టీసీఎస్‌ కంటే ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ విలువ రూ.1,586.43 కోట్లు అధికం.

బీఎస్‌ఈలో ఆర్‌ఐఎల్‌ షేరు ధర 1.19 శాతం లాభంతో రూ.1,416.40 వద్ద ముగియగా, టీసీఎస్‌ షేరు ధర 0.77 శాతం లాభంతో రూ.2,329.10 వద్ద క్లోజయింది. నాలుగేళ్ల క్రితం మార్కెట్‌ విలువ పరంగా అగ్ర స్థానంలో ఉన్న ఆర్‌ఐఎల్‌ను దాటుకుని టీసీఎస్‌ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. కాగా, ఇటీవలి కాలంలో ఐటీ రంగ షేర్లకు ప్రతికూలతలు ఎదురవడం, అదే సమయంలో జియో ప్రవేశంతో ఆర్‌ఐఎల్‌ షేరు ధర ఎగబాకడంతో తిరిగి పూర్వపు స్థానాన్ని దక్కించుకునేలా చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement