జోరు తగ్గుతున్న జియో!
♦ మార్చిలో తగ్గిన కొత్త యూజర్లు
♦ ఆకట్టుకోని ప్రైమ్ ఆఫర్
♦ దీర్ఘకాలంలో ఎయిర్‌టెల్‌దే హవా
♦ యూబీఎస్ నివేదిక
ముంబై: చౌక టారిఫ్‌లతో దేశీ టెలికం రంగంలో సంచలనం సృష్టించినప్పటికీ .. కొత్త యూజర్లను ఆకర్షించడంలో రిలయన్స్ జియో జోరు కాస్త మందగించింది. మార్చి గణాంకాలు ఇందుకు నిదర్శనం. ఫిబ్రవరిలో 1.22 కోట్ల మంది యూజర్లను దక్కించుకున్న జియో మార్చిలో కేవలం 58 లక్షల మంది కొత్త సబ్‌స్క్రయిబర్స్‌ను నమోదు చేయగలిగింది. దీంతో ఫిబ్రవరిలో 8.8%గా ఉన్న జియో మార్కెట్ వాటా తర్వాత నెలలో కేవలం 9.3%కి పెరిగింది.
టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాల ఆధారంగా కన్సల్టెన్సీ సంస్థ యూబీఎస్.. భారత టెలికం రంగంపై రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మార్చిలో కొత్త యూజర్లను జోడించుకునే విషయంలో ఇతర టెల్కోలు.. ముఖ్యంగా ఎయిర్‌టెల్ మెరుగైన పనితీరు కనపర్చింది. మార్కెట్ సరళి చూస్తుంటే ఎయిర్‌టెల్ పటిష్టంగానే ఉన్నట్లు కనిపిస్తోందని యూబీఎస్ వివరించింది. కార్యకలాపాలు విస్తరించడంలోనూ, భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టగలిగే సామర్ధ్యంపరంగానూ చూస్తే దీర్ఘకాలికంగా ఎయిర్‌టెల్ గెలుపుగుర్రంగా నిలవగలదని పేర్కొంది.
రాశి తగ్గినా.. ఫస్టే..
కొత్త యూజర్ల సంఖ్య పెరిగే వేగం మందగించినా... నికరంగా చేరే వారి సంఖ్య విషయంలో జియోనే ముందువరుసలో ఉంది. భారతి ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్, బీఎస్‌ఎన్‌ఎల్, వొడాఫోన్ వరుసగా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మార్చిలో జియో ప్రైమ్ ఆఫర్‌ని ప్రకటించినప్పటికీ .. యూజర్ల సంఖ్య అంతక్రితం నెలతో పోలిస్తే భారీగా పెరగకపోవడం ఆశ్చర్యకరమైన విషయమని యూబీఎస్ తన నివేదికలో పేర్కొంది. జియో పెయిడ్ సర్వీసులు ఏప్రిల్ నుంచి ప్రారంభం అయిన నేపథ్యంలో.. కొత్తగా జియో కనెక్షన్ తీసుకున్నవారు, ఇతర టెల్కోల నుంచి జియోకి మారిన వారి గురించి మరింత సమాచారం లభించగలదని యూబీఎస్ వివరించింది.
ఇతర టెల్కోల రికవరీ..
జియో ఆఫర్లకు దీటైన ఆఫర్లు ప్రకటించడంతో మార్చిలో ఎయిర్‌టెల్ యూజర్ల సంఖ్య నికరంగా 30 లక్షలు, ఐడియా 21 లక్షలు, వొడాఫోన్ 18 లక్షల మేర పెరిగింది. ఫిబ్రవరిలో కొత్తగా ఎయిర్‌టెల్ కనెక్షన్ తీసుకున్న వారి సంఖ్య 12 లక్షలు, ఐడియా యూజర్లు 12 లక్షలు, వొడాఫోన్ యూజర్ల సంఖ్య 8 లక్షల మేర పెరిగింది.