
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2019 అక్టోబర్‌లో అదుపు తప్పింది. 4.62 శాతంగా నమోదయ్యింది. అంటే వినియోగ వస్తువుల బాస్కెట్ ధర 2018 అక్టోబర్‌తో పోల్చిచూస్తే, 2019 అక్టోబర్‌లో 4.62 శాతం పెరిగిందన్నమాట. గడిచిన 16 నెలల కాలంలో (జూన్ 2018లో 4.92 శాతం) ఇంత తీవ్ర స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే తొలిసారి. రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతాన్ని మించకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి (ఆర్‌బీఐ) కేంద్రం నుంచి నిర్దేశం. అయితే, దీనికి ‘ప్లస్ 2’ లేదా ‘మైనస్ 2’ శాతాన్ని తగిన స్థాయిగా పరిగణనలోకి తీసుకుంటారు. అంటే రిటైల్ ద్రవ్యోల్బణం ఎగువదిశలో 4% దాటకూడదన్నమాట.
సెప్టెంబర్‌లో 5.11 శాతంగా ఉన్న ఆహార ఉత్పత్తుల బాస్కెట్ ధరల స్పీడ్ అక్టోబర్‌లో 7.89%కి పెరిగింది. ఒక్క కూరగాయల ధరలు ఇదే కాలంలో 5.40%నుంచి 26.10%కి ఎగిశాయి. పండ్ల ధరలు 0.83% నుంచి 4.08%కి పెరిగాయి. తృణధాన్యాల ధరలు 2.16%, మాంసం, చేపల ధరలు 9.75%, గుడ్ల ధరలు 6.26% పెరిగాయి. పప్పులు సంబంధిత ఉత్పత్తుల ధరలు 11.72 శాతం ఎగిశాయి. పాలు, పాల ఉత్పత్తుల ధరలు 3.10 శాతం పెరిగాయి.
రెపోరేటు కోత ఇక లేనట్లే!
అక్టోబర్‌లో ఈ రేటు అదుపు తప్పిన నేపథ్యంలో మరో దఫా ఆర్‌బీఐ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు (ప్రస్తుతం 5.15%) తగ్గింపునకు అవకాశాలు తక్కువేనన్నది నిపుణుల అభిప్రాయం. అలా చేస్తే, వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) మరింత పెరుగుతుందని, దీనితో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందనీ, ఇది నిరుపేదల కొనుగోళ్లపై పెను భారం చూపుతుందన్నది ఆర్థిక సిద్ధాంతం. గడిచిన ఐదు ఆర్‌బీఐ ద్వైమాసిక సమావేశాల్లో 135 బేసిస్ పాయింట్లు (1.35%) రెపో రేటు తగ్గి 5.15 శాతానికి దిగివచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment