
న్యూఢిల్లీ : నేడు ఉదయం విడుదలైన ఏప్రిల్ నెల టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్టాన్ని తాకగా.. రిటైల్ ద్రవ్యోల్బణం కూడా మూడు నెలల గరిష్టానికి ఎగిసింది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.58 శాతానికి పెరిగినట్టు తెలిసింది. మార్చి నెలలో ఈ ద్రవ్యోల్బణం 4.28 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ప్రధానంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఈ ద్రవ్యోల్బణం పెరిగినట్టు ప్రభుత్వ డేటా వెల్లడించింది. ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. గ్లోబల్‌గా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండటంతో, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు కాక పుట్టిస్తున్నాయి.
కాగ, రాయిటర్స్ అంచనాల ప్రకారం ఈ ద్రవ్యోల్బణం 4.42 శాతానికి పెరుగుతుందని మాత్రమే భావించారు. కానీ అంచనాలకు మించి ఇది పెరిగింది. ద్రవ్యోల్బణాలు పెరగడం తదుపరి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ సమీక్షలో రేట్ల కోతకు అవకాశాలను సన్నగిలుస్తున్నాయి. తదుపరి ఆర్‌బీఐ మానిటరీ పాలసీ జూన్‌లో ఉండనుంది. కాగ, ఉదయం విడుదలైన డబ్ల్యూపీఐ కూడా నాలుగు నెలల గరిష్టంలో 3.18 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ఆహార ధరల్లో పెరుగుదల ఈ ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీసినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment