అన్ని కాలాల్లోనూ సూచీలకు తగ్గకుండా రాబడులను అందించడంలో ఎడెల్వీజ్ లార్జ్‌క్యాప్ పథకం పనితీరు గురించి తప్పకుండా చెప్పుకోవాల్సిందే. గడిచిన ఏడాది కాలంలో 17 శాతం రాబడులను అందించి లార్జ్‌క్యాప్ విభాగంలో ఉత్తమ పథకంగా నిలిచింది. లార్జ్‌క్యాప్ కారణంగా మార్కెట్లు ర్యాలీ చేయగా, ఇదే కాలంలో పోటీ పథకాల్లో రాబడులు ఒక అంకె వరకే ఉండటం గమనార్హం. బెంచ్‌మార్క్ నిఫ్టీ50తో పోలిస్తే రాబడుల్లో ముందు నిలిచింది. ఈ పథకం 2009లో ప్రారంభం కాగా, పనితీరు విషయంలో అప్పటి నుంచి మెరుగైన ప్రదర్శనే చూపుతోంది. దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెట్టగలిగే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు.
పోర్ట్‌ఫోలియో
నాణ్యమైన వ్యాపారంతోపాటు, ఆ వ్యాపారంలో స్థిరమైన అధిక వృద్ధికి అవకాశం ఉన్న స్టాక్స్‌లో ఎడెల్వీజ్ లార్జ్‌క్యాప్ ఇన్వెస్ట్ చేస్తుంది. వృద్ధి అవకాశాలకు తోడు షేరు ధర ఆకర్షణీయ స్థాయిలో ఉన్న స్టాక్స్‌ను ఎంచుకుంటుంది. భిన్న రంగాలకు చెందిన 50కు పైగా లార్జ్‌క్యాప్ స్టాక్స్‌ను ఎంచుకోవడం ద్వారా ఆటుపోట్లకు చెక్ పెట్టడం, రిస్క్‌ను సాధ్యమైనంత తగ్గించుకోవడం ఈ పథకం విధానాల్లో భాగం. స్టాక్స్ ఎంపిక పటిష్టంగా ఉండటం, క్యాష్ కాల్స్ తీసుకోవడం వంటి విధానాలు ఈ పథకం పనితీరు మార్కెట్ ర్యాలీల్లో మెరుగ్గా ఉండటం, కరెక్షన్లలో నష్టాలను పరిమితం చేసేందుకు సాయపడుతోంది.
2014, 2017 మార్కెట్ ర్యాలీల్లో లార్జ్‌క్యాప్ విభాగంలోనూ, బెంచ్ మార్క్ రాబడులతో పోల్చి చూస్తే ఎడెల్వీజ్ లార్జ్‌క్యాప్ మెరుగ్గా ఉండటం గమనార్హం. అలాగే, 2011, 2015 మార్కెట్లలో బలహీనత నెలకొన్న సమయాల్లోనూ పనితీరులో ముందే ఉంది. అస్సెట్ అలొకేషన్ (పెట్టుబడుల కేటాయింపు)ను వేగంగా మార్పు చేయడాన్ని కూడా గమనించొచ్చు. ఉదాహరణకు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈక్విటీలకు కేటాయింపులు 79 శాతంగా ఉండగా, మే నెలకు వచ్చే సరికి 84 శాతానికి పెంచుకుంది.
తిరిగి జూన్ నెలలో 76 శాతానికి తగ్గించుకుంది. దీనివల్ల అధిక పోర్ట్‌ఫోలియో టర్నోవర్‌కు దారితీస్తుంది. అయినప్పటికీ దీనివల్ల అధిక ఎక్స్‌పెన్స్ రేషియోకు దారితీయకపోవడాన్ని గమనించొచ్చు. ముఖ్యంగా ఈ పథకంలో ఆకర్షణీయమైన అంశం... రెగ్యులర్ పథకంలో ఎక్స్‌పెన్స్ రేషియో కేవలం 1.38 శాతంగానే ఉండటం. మిగిలిన పథకాల్లో ఇది 2.6 శాతం వరకు ఉండడాన్ని చూడొచ్చు. దీనివల్ల దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు అధిక రాబడులకు వీలుంటుంది.
స్టాక్స్ ఎంపిక
ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో దిగ్గజ కంపెనీలన్నీ ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్తాన్ యూనిలీవర్, టీసీఎస్‌లో వాటాను పెంచుకుంది. నిజానికి ఇదే కాలంలో ఈ స్టాక్స్ మంచి ర్యాలీ చేయడంతో ఈ పథకం మెరుగైన రాబడులను ఇవ్వగలిగింది. ఇక గత ఏడాదిలో ప్రైవేటు రంగ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు, సాఫ్ట్ వేర్ కంపెనీల్లో వాటాలను పెంచుకుంది. ప్రస్తుతం ఫైనాన్షియల్, ఎఫ్‌ఎంసీజీ, టెక్నాలజీ రంగ స్టాక్స్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment