
న్యూఢిల్లీ: కేబుల్ టీవీ, హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను పెద్దయెత్తున విస్తరించే క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఇప్పటికే ఆయా రంగాల్లో ఉన్న కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టింది. డెన్ నెట్‌వర్క్స్, హాథ్‌వే కేబుల్ అండ్ డేటాకామ్ సంస్థల్లో గణనీయ వాటాలు కొనే దిశగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇవి తుది దశల్లో ఉన్నాయని, బుధవారం ఈ డీల్స్‌పై ప్రకటన వెలువడొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
‘హాథ్‌వే కేబుల్ అండ్ డేటాకామ్, డెన్ నెట్‌వర్క్స్‌లో వాటాల కొనుగోలు కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థల ద్వారా జరుపుతున్న చర్చలు తుది దశల్లో ఉన్నాయి. బుధవారం వీటికి సంబంధించి డీల్స్‌ను ప్రకటించవచ్చు‘ అని వివరించాయి. మరోవైపు ఈక్విటీ షేర్ల జారీ ద్వారా నిధులు సమీకరించడంపై అక్టోబర్ 17న (బుధవారం) తమ తమ బోర్డులు సమావేశం కానున్నట్లు హాథ్‌వే, డెన్ నెట్‌వర్క్స్ సంస్థలు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేశాయి.
హాథ్‌వే ప్రస్తుతం నాలుగు మెట్రోలు సహా 16 నగరాల్లో హై స్పీడ్ కేబుల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తోంది. కంపెనీకి సుమారు 35,000 కిలోమీటర్ల మేర ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్ ఉండగా, 8 లక్షల మంది బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు ఉన్నారు. ఇక 15 నగరాల్లో కార్యకలాపాలు విస్తరిస్తున్న డెన్ కేబుల్.. 2–3 ఏళ్లలో 500 నగరాల్లో సర్వీసులు అందిం చేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటోంది.