
2016–17లోనూ ముకేశ్ వేతనం రూ. 15 కోట్లే
వరుసగా తొమ్మిదో సంవత్సరం
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ వరుసగా తొమ్మిదో సంవత్సరమూ రూ. 15 కోట్ల వార్షిక వేతనానికే పరిమితమయ్యారు. సీఈవోల జీతభత్యాలు సముచిత స్థాయిలోనే ఉండాలన్న వాదనలు 2008–09లో తెరపైకి వచ్చినప్పట్నుంచీ ఆయన జీతభత్యాలు, కమిషన్లు మొదలైనవి ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. మేనేజింగ్ స్థాయి కీలకోద్యోగుల వేతనాలు ఒక మోస్తరు స్థాయిలో ఉండాలని, దానికి తనే ఉదాహరణగా నిలవాలని ముకేశ్ అంబానీ భావిస్తారని కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ముకేశ్ అంబానీ జీతభత్యాలు రూ. 38.75 కోట్ల మేర ఉండాలని బోర్డు ఆమోదించినప్పటికీ.. ఆయన అభిప్రాయం మేరకు దీన్ని రూ. 15 కోట్లకే పరిమితం చేసినట్లు వివరించింది.
2016–17లో ముకేశ్ అంబానీ రూ. 4.16 కోట్లు జీతంగాను, మరో రూ. 60 లక్షలు భత్యాలుగాను, రిటైర్మెంట్ ప్రయోజనాల కింద రూ. 71 లక్షలు, లాభాలపై కమీషన్ల కింద రూ. 9.53 కోట్లు అందుకున్నారు. మరోవైపు కంపెనీలో ఇతర ఉద్యోగుల జీతభత్యాలు మాత్రం పెరిగాయి. అంబానీ కజిన్లు నిఖిల్ ఆర్ మేస్వాని, హితల్ ఆర్ మేస్వాని వేతనం రూ. 16.58 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం వీరు రూ. 14.40 కోట్ల స్థాయిలో అందుకున్నారు. ఇక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ వేతనం రూ. 7.23 కోట్ల నుంచి రూ. 7.87 కోట్లకు పెరిగింది. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఉన్న ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ .. రూ. 4 లక్షలు సిటింగ్ ఫీజు కింద. రూ. 1.35 కోట్లు కమీషన్ కింద పొందారు. సిటింగ్ ఫీజు గతంలో అందుకున్న రూ. 6 లక్షలతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ 2015–16లో అందుకున్న రూ. 1.20 కోట్ల కమీషన్ కన్నా తాజాగా మరింత ఎక్కువ పొందారు.