కొత్త వంద రూపాయి నోట్లు
న్యూఢిల్లీ : లేత వంగ పువ్వు వర్ణంలో కొత్త వంద రూపాయి నోటు త్వరలోనే చలామణిలోకి రాబోతుంది. ఈ నోటు ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న నోటు కంటే కాస్త చిన్నదిగా ఉన్నట్టు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. దీంతో ఏటీఎంలలో ఈ నోట్లను అందుబాటులోకి తీసుకురావడానికి, ఏటీఎంలను మార్చాల్సి వస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 2 లక్షల 40 వేట ఏటీఎంలను కొత్త వంద నోటుకు అనుగుణంగా మార్చాల్సి వస్తుందని ఏటీఎం ఆపరేటర్లు తెలిపారు. దీనికోసం దాదాపు 100 కోట్ల రూపాయలను ఏటీఎం ఇండస్ట్రి వెచ్చించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియకు గడువు కూడా ఏడాదికి మించి పట్టనుందని తెలిపారు. కొత్త బ్యాంక్ నోటు 66 ఎంఎం x 142 ఎంఎం సైజులో ఉండనుందని ఆర్‌బీఐ నోటిఫికేషన్‌లో తెలిసింది. ఇది ప్రస్తుతమున్న 73 ఎంఎం x 157 ఎంఎం పరిణామాల కంటే తక్కువ. ‘కొత్త 100 రూపాయల నోట్ల కోసం రికాలిబ్రేషన్ చేసేందుకు రూ.100 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని మేము నమ్ముతున్నాం. దీనికి 12 నెలల మేర సమయం పట్టే అవకాశముంది’ అని హిటాచి పేమెంట్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ లోని ఆంటోని తెలిపారు.
కొత్త నోట్లతో తమకు సవాళ్లు పెరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. అయితే 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్త ప్రమాణాలు, మరింత భద్రతా అంశాలతో కొత్త నోట్లను ఆర్‌బీఐ విడుదల చేస్తోంది. తాజాగా తెస్తున్న రూ.100 నోటు ఈ క్రమంలో అయిదో నోటు. అంతకుముందు కొత్త రూ.500, 2000, రూ.50, 200 నోట్లు వచ్చాయి. వీటిల్లో రూ.50ని ఏటీఎంలలో ఉంచడం లేదు. కొత్త నోట్లకు అనుగుణంగా దేశంలోని 2.4 లక్షల ఏటీఎంలలో ఎప్పటికప్పుడు మార్పులు చేయాల్సి వస్తోంది. తాజాగా మళ్లీ రూ.100 నోట్ల జారీకి అనుగుణంగా తీర్చిదిద్దాలంటే, ఒత్తిడి పెరిగినట్లేనని ఏటీఎం పరిశ్రమ చెబుతోంది. కొత్త వంద నోట్ల ప్రింటింగ్ ఇప్పటికే దేవాస్‌లో ప్రారంభమైందని సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. ప్రతి ఒక్క ఏటీఎంలో నాలుగు క్యాసెట్స్ ఉంటాయి. రెండు క్యాసెట్లను సింగిల్ డినామినేషన్‌కు, మరో రెండు క్యాసెట్లు అత్యధిక డినామినేషన్ నోట్లకు అనుగుణంగా ఏటీఎంలు ఉన్నాయి.
2.4 లక్షల ఏటీఎంల నిర్వహణ ఇలా..
దేశంలో ఉన్న మొత్తం ఏటీఎంలు 2.4 లక్షలు. ఇందులో ఎన్‌సీఆర్ 1.1 లక్షల ఏటీఎంలను నిర్వహిస్తుండగా.. 55,000 ఏటీఎంలను హిటాచి నిర్వహిస్తోంది. 12,000 ఏటీఎమ్‌లు ఎఫ్‌ఐఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. గత ఆగస్టులో ప్రవేశపెట్టిన రూ.200 నోట్ల కోసం ఏటీఎమ్‌లను మార్చడానికి రూ.100-120 కోట్లు ఖర్చయ్యాయి. కొత్త నోటుకు అనుగుణంగా ఒక్కో ఏటీఎం మార్చడానికి అయ్యే ఖర్చు రూ. 3000-4000 ఉంటుందని ఇండస్ట్రి వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment