కొత్త వంద రూపాయల నోటు
న్యూఢిల్లీ : గులాబీ రంగులో 2000 రూపాయల నోటు.. పసుపు రంగులో 200 రూపాయల నోటు.. ఆకుపచ్చ రంగులో 50 రూపాయల నోటు.. చాక్లెట్ రంగులో 10 రూపాయల నోటు.. ఇలా విభిన్న రంగుల్లో కొత్త కొత్త నోట్లను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పెద్ద నోట్లను రద్దు తర్వాత నకిలీలకు తావులేకుండా ఈ నోట్లలో సెక్యురిటీని మరింత పెంచుతూ తీసుకొచ్చింది. తాజాగా వంద రూపాయల కొత్త నోటును కూడా ఆర్‌బీఐ తీసుకొస్తోందట. వచ్చే నెలలో ఈ కొత్త నోటును ప్రవేశపెట్టబోతుందని ‘బిజినెస్ న్యూస్’ రిపోర్టు చేసింది. ఈ నోటు ముదురు నీలం రంగులో ఉంటుందని తెలిపింది.
కొత్త వంద రూపాయల నోట్లు వచ్చినప్పటికీ, ప్రస్తుతం చలామణిలో ఉన్న వంద రూపాయల నోట్లపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కొత్త రూ.100 నోటుకు ప్రింటింగ్ ప్రెస్ వద్ద తుది ఆమోదం లభించిందని, రెండు వేల రూపాయల నోట్లు ప్రింట్ చేసే దగ్గరే, ఈ కొత్త వంద రూపాయల నోట్లను ప్రింట్ చేస్తున్నట్టు బిజినెస్ న్యూస్ రిపోర్టు చేసింది. విదేశీ ఇంక్‌తో దివాస్ ప్రింటింగ్ ప్రెస్ వద్ద ఈ నోట్ల ప్రింటింగ్ కూడా ప్రారంభమైందట.
కొత్త నోట్లకు అనుగుణంగా బ్యాంకులు తమ ఏటీఎంలలో మార్పులు కూడా చేపడుతున్నాయని తెలిసింది. కాగా, 2017 ఆగస్టులోనే ఆర్‌బీఐ కొత్త 200 రూపాయల నోటును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నోటు ముందు భాగం కుడివైపు చివరన అశోక స్థూపాన్ని ముద్రించారు. మహత్మా గాంధీ కొత్త సిరీస్ తో ఈ నోటు మార్కెట్‌లోకి వచ్చింది. దేవనాగరి లిపిలో రూ 200 అంకెను నోటు ముందు, వెనుక భాగంలో ముద్రించారు.
Comments
Please login to add a commentAdd a comment