
ముంబై: మోదీ ప్రభుత్వమే మళ్లీ కొలువుదీరనుందంటూ వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రూపాయి మారకపు విలువకూ బలాన్ని ఇచ్చాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ ఒకేరోజు 49 పైసలు బలపడింది. 69.74 వద్ద ముగిసింది. రూపాయి ఒకేరోజు భారీ స్థాయిలో బలపడ్డం రెండు నెలల తర్వాత (మార్చి 18న 57 పైసలు పెరిగింది) ఇదే తొలిసారి. ట్రేడింగ్ మొదట్లో 70.36 వద్ద ప్రారంభమైన రూపాయి, అటు తర్వాత 69.44 స్థాయినీ చూసింది. చివరకు రెండు వారాల గరిష్టస్థాయి 69.74 వద్ద ముగిసింది. శుక్రవారం రూపాయి విలువ ముగింపు 70.23. సోమవారం ఈక్విటీ మార్కెట్ల పరుగు రూపాయి సెంటిమెంట్‌నూ పటిష్టస్థాయిలో బలపరిచిందని నిపుణుల విశ్లేషణ.
అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే క్రూడ్ ధరల భారీ పతనం, ఎన్నికల అనంతరం మోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాల నేపథ్యంలో రూపాయి రెండు నెలల క్రితం 68 స్థాయినీ చూసింది. అయితే ఇటీవలి అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, ఈక్విటీ మార్కెట్ల పతనం, డాలర్ బలోపేతం, క్రూడ్ ధరలు తిరిగి ఆందోళనకర స్థాయికి చేరుతుండడం వంటి అంశాలు రూపాయికి ప్రతికూలంగా మారాయి. తాజా ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు తక్షణం రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచినా, క్రూడ్ ధరల పెరుగుదల, డాలర్ పటిష్టస్థాయి దీర్ఘకాలంలో రూపాయి విలువను ఆందోళనకు గురిచేసేవే అని నిపుణుల అంచనా.
Comments
Please login to add a commentAdd a comment