
ముంబై: డాలరుతో రూపాయి మారకం విలువ మరోసారి కుదేలైంది. శుక్రవారం 20 పైసలు నష్టపోయి 70.23 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 70.22 వద్ద ప్రారంభమై ఒక దశలో 70.32 వద్దకు పతనమైంది. గురువారం నాటి ముగింపు 70.03తో పోల్చితే చివరకు 20 పైసలు బలహీనపడింది. వరుసగా మూడు రోజులపాటు బలపడుతూ వచ్చిన భారత కరెన్సీ.. పెరిగిన ముడిచమురు ధరలు, విదేశీ నిధుల ఉపసంహరణ కారణంగా వారాంతాన మళ్లీ బక్కచిక్కిందని ఫారెక్స్ మార్కెట్ నిపుణులు విశ్లేషించారు.
వారం మొత్తం మీద చూస్తే.. 31 పైసలు నష్టపోయి, వరుసగా రెండవ వారంలోనూ బలహీనతను నమోదుచేసింది. అమెరికా డాలరుతో ఆసియా దేశాల కరెన్సీలు బలహీనపడడం కూడా రూపాయిపై ఒత్తిడికి మరో కారణంగా నిలిచిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ హెడ్ (పీసీజీ, క్యాపిటల్ మార్కెట్స్ స్ట్రాటెజీ విభాగం) వీకే శర్మ అన్నారు. ఎగ్జిట్ పోల్స్, సాధారణ ఎన్నికల ఫలితాలు ఉన్నందున వచ్చేవారం రోజుల్లో భారీ ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని అంచనావేశారు.