19న సహారా కేసుపై కొత్త బెంచ్ విచారణ
న్యూఢిల్లీ: సహారా కేసు విచారణకు సుప్రీం కోర్టు కొత్త బెంచ్ ఏర్పాటు అయ్యింది. జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, జస్టిస్ ఎ.కె.సిక్రిలు సభ్యులుగా ఉండే ఈ బెంచ్ వచ్చే సోమవారం (మే 19) విచారణ చేపట్టనుంది. న్యాయమూర్తులు జె.ఎస్. కేహార్, కె.ఎస్. రాధాకృష్ణన్‌లతో కూడిన ధర్మాసనం 2012 నుంచి సహారా కేసును విచారించింది. అయితే, ఈ నెల 14న రాధాకృష్ణన్ రిటైర్ కావడం, కేహార్ స్వచ్ఛందంగా తప్పుకోవడంతో కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేశారు.
2-పీపీఎఫ్ ఉండగా వ్యక్తిగత రుణాలెందుకు?
శకునాలు చెప్పే బల్లి కుడితితొట్లో పడిందన్న సామెత చందంగా... ఆర్థిక వ్యవహారాల్లో మహా జాగ్రత్తపరులకు కూడా కొన్నిసార్లు విపత్కరపరిస్థితులు ఎదురవుతుంటాయి. అర్జెంటుగా డబ్బు అవసరమవుతుంది. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది పర్సనల్ లోన్లు తీసుకుంటారు. లేదంటే క్రెడిట్ కార్డులను ఆశ్రయిస్తారు. ఇలాంటి రుణాలపై వడ్డీ అధికంగా ఉంటుంది. అత్యవసరంగా సొమ్ము సమకూర్చుకునే హడావుడిలో వడ్డీ భారం తక్కువగా ఉండే మార్గాలను పట్టించుకోరు.
ఇలాంటి సందర్భాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి రుణం తీసుకోవచ్చు. లేదంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)పై లోను పొందవచ్చు. తద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.
పీపీఎఫ్ నుంచి కొంత తీసుకోవచ్చు..
ఈ అకౌంట్ నుంచి పూర్తి మొత్తం తీసుకోవాలంటే మెచ్యూరిటీ (లాకిన్ పీరియడ్) పూర్తయ్యేవరకు ఆగాల్సిందే. ఆర్థిక సంక్షోభం, ఇతర అత్యవసర పరిస్థితుల్లో కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. పీపీఎఫ్ అకౌంట్ ప్రారంభించిన తర్వాత ఏడో సంవత్సరం నుంచి కొంత మొత్తాన్ని తీసుకునే అర్హత వస్తుంది. ఒకవేళ, పీపీఎఫ్ నుంచి పాక్షిక మొత్తాన్ని ఉపసంహరించుకునే అర్హత లేకుంటే పీపీఎఫ్‌పై రుణం పొందవచ్చు. దీనికి కూడా కొన్ని షరతులున్నాయి. మూడో ఆర్థిక సంవత్సరం తర్వాత మొదటి సారి రుణం తీసుకోవచ్చు. ఆరో ఆర్థిక సంవత్సరం తర్వాత రెండో సారి లోన్ పొందవచ్చు. అయితే, అంతకుముందు తీసుకున్న రుణాన్ని సక్రమంగా తీర్చి ఉండాలి.
ఎంత రుణం తీసుకోవచ్చంటే...
నాలుగో ఆర్థిక సంవత్సరంలో లోన్ తీసుకోవాలని అనుకుంటే రెండో ఆర్థిక సంవత్సరం చివరలోని బ్యాలెన్సును పరిగణనలోకి తీసుకుంటారు. ఐదో సంవత్సరంలో రుణం తీసుకోవాలనుకుంటే మూడో ఏడాది చివరి బ్యాలెన్సును పరిగణనలోకి తీసుకుంటారు. ఈ బ్యాలెన్సులో గరిష్టంగా 25 శాతం రుణం ఇస్తారు. పీపీఎఫ్ రుణంపై వడ్డీ రేటు పీపీఎఫ్ బ్యాలెన్సుపై చెల్లిస్తున్న వడ్డీ కంటే రెండు శాతం ఎక్కువ. అంటే, పీపీఎఫ్ అకౌంటుపై వడ్డీ 8.8 శాతంగా ఉంటే, పీపీఎఫ్ లోన్‌పై వడ్డీ రేటు 10.8 శాతంగా ఉంటుంది. ఇతర వడ్డీ రేట్లతో పోలిస్తే ఇది చాలా తక్కువే కదా.
36 నెలల్లో తిరిగి చెల్లించాలి...
పీపీఎఫ్‌పై తీసుకున్న రుణాలను గరిష్టంగా 36 నెల ల్లోగా తిరిగి చెల్లించేయాలి. అసలును, వడ్డీని విడివిడి గా చెల్లించవచ్చు. నిర్ణీత వ్యవధిలోగా రుణం చెల్లించకపోతే వడ్డీ రేటు నాలుగు శాతం పెరుగుతుంది.