భారత్‌లో శామ్‌సంగ్ మూడో ప్లాంటు
3 రాష్ట్ర ప్రభుత్వాలతో కంపెనీ చర్చలు
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కీలకమైన భారత మార్కెట్లో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి సారించింది. తాజాగా భారత్‌లో మూడో తయారీ ప్లాంటును ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో స్థలం కోసం అన్వేషిస్తోంది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది.
ఈ ప్లాంటులో స్మార్ట్‌ఫోన్లు సహా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు కూడా తయారు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవల భారత్‌లో పర్యటించిన శామ్‌సంగ్ మొబైల్ విభాగం చీఫ్ జేకే షిన్ కొత్త ప్లాంటు గురించి చర్చించినట్లు, స్థలం ఇతరత్రా అంశాలను బట్టి 500 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల దాకా కంపెనీ ఇన్వెస్ట్ చేయొచ్చని వివరించాయి.
శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్‌కు ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో, తమిళనాడులో రెండు ప్లాంట్లు, మూడు పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. దేశీయంగా విక్రయించే హ్యాండ్‌సెట్స్‌లో 90 శాతం మొబైల్స్‌ను ఈ ప్లాంట్లలోనే శామ్‌సంగ్ తయారు చేస్తోంది. ప్రస్తుతం వీటిలో 45,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు.