
ఇక ‘స్టార్టప్’ శాంసంగ్!
మందగిస్తున్న డిమాండ్, పెరుగుతున్న పోటీతో దిగ్గజ కంపెనీలు అంతర్గతంగా సంస్కరణలకు సిద్ధమవుతున్నాయి..
నిర్వహణపరమైన సంస్కరణలపై దృష్టి
సియోల్: మందగిస్తున్న డిమాండ్, పెరుగుతున్న పోటీతో దిగ్గజ కంపెనీలు అంతర్గతంగా సంస్కరణలకు సిద్ధమవుతున్నాయి. తాజాగా దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ ఇదే అంశంపై దృష్టి పెట్టింది. సంప్రదాయ కార్పొరేట్ కల్చర్‌ను పక్కన పెట్టి స్టార్టప్ సంస్థల తరహా అధికార క్రమాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. పై స్థాయిలోని ఎగ్జిక్యూటివ్‌లు మొదలుకుని కింది స్థాయి వర్కర్ల దాకా అధికార పరమైన సమస్యలు లేకుండా చూడాలని, అనవసర సమావేశాలు, అధిక పని వేళలు మొదలైన వాటికి స్వస్తి చెప్పాలని స్టార్టప్ శాంసంగ్ కార్యక్రమంలో కంపెనీ నిర్దేశించుకుంది.
అలాగే ఉద్యోగులు మరింత సమయం తమ కుటుంబాలతో గడిపేలా కొత్త సెలవుల విధానాలు, సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ కోసం ఉద్యోగులకు వెసులుబాటు కల్పించడం తదితర అంశాలు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఉద్యోగుల పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలన్నింటినీ జూన్‌లో ప్రకటించగలమని శాంసంగ్ పేర్కొంది. అయితే, దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన సీనియారిటీ ఆధారిత అధికార ధోరణులను సరిచేయడం కంపెనీకి పెద్ద సవాలేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
శాంసంగ్ చైర్మన్ లీ కున్-హి అనారోగ్యం కారణంగా కంపెనీ పగ్గాలు ఆయన కుమారుడు లీ జే-యాంగ్ (48) చేతికే వస్తాయన్న అంచనాల నేపథ్యంలో తాజా వ్యాపార వ్యూహాలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. శాంసంగ్ ప్రధాన వ్యాపార విభాగాలైన సెమీ కండక్టర్లు, ఫోన్లకు చైనా కంపెనీల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఈ తరుణంలో కంపెనీ నెమ్మదిగా హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్ విభాగాల్లోకి కూడా విస్తరిస్తోంది.