ఇల్లు, పెళ్లి తరువాత గానీ... చదువు కొని చూడు | Saving for education | Sakshi
Sakshi News home page

ఇల్లు, పెళ్లి తరువాత గానీ... చదువు కొని చూడు

Published Mon, Jul 20 2015 12:19 AM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM

ఇల్లు, పెళ్లి తరువాత గానీ... చదువు కొని చూడు - Sakshi

ఇల్లు, పెళ్లి తరువాత గానీ... చదువు కొని చూడు

♦ పొదుపు వెనక తల్లిదండ్రుల ప్రధాన ఉద్దేశం ఇదే 
♦ నానాటికీ పెరిగి తడిసి మోపెడవుతున్న విద్యా వ్యయం
♦ దాన్ని తట్టుకునేందుకు వారి చిన్నప్పటి నుంచే పొదుపు
బీమా, మ్యూచువల్ ఫండ్లు సహా ఎన్నో కొత్త పథకాలు
♦ కాస్త రిస్కు ఎక్కువైనా ఈక్విటీవైపే పలువురి మొగ్గు

 పెళ్లి చెయ్యటం... ఇల్లు  కట్టుకోవటం. ఒకప్పుడు ఎవరికైనా ఆర్థిక లక్ష్యాలు ఈ రెండే. రిటైరయ్యేలోపు ఈ రెండింటినీ సాధిస్తే చాలు. ఒకవేళ సాధించలేకపోయినా... పిల్లలకు పెళ్లిళ్లు చేసేసి, రిటైరయ్యేటపుడు వచ్చిన డబ్బుతో ఇల్లు కట్టుకునేవారు. తరవాత పింఛన్‌తో హాయిగా కాలం గడిపేసేవారు. మరి ఇప్పుడో!!?ఇల్లు, పిల్లల పెళ్లి సంగతి తరవాత. వాళ్ల భవిష్యత్ బాగుండాలంటే ముందు బాగా చదివించాలి. అలా చదివించేసరికే తల్లిదండ్రుల పని అయిపోతోంది. ఎందుకంటే విద్యా వ్యయమనేది ద్రవ్యోల్బణం కన్నా వేగంగా పెరుగుతోంది. మరి ఇలాంటపుడు ఏం చేయాలి? పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేయాలంటే అందుబాటులో ఉన్న సాధనాలేంటి? ఈ వివరాలే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ ప్రధాన కథనం...
 - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం
 
 స్థిరాదాయం కావాలంటే...

  ఎటువంటి రిస్క్ తీసుకోలేని వారు స్థిరమైన ఆదాయాన్నిచ్చే బ్యాంకు డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ వంటి పథకాలవైపు చూడొచ్చు. కేవలం అమ్మాయిల పెళ్లిళ్ల కోసం నిధిని సమకూర్చుకోవాలి అనుకునే వారికి మాత్రం కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ప్రవేశపెట్టిన సుకన్య-సమృద్ధి పథకం చాలా అనువుగా ఉంది. అమ్మాయిల పేరిట మాత్రమే తీసుకోవడానికి వీలైన ఈ పథకానికి అమ్మాయి పెళ్ళి లేదా అమ్మాయికి 21 ఏళ్లు.. ఏది ముందైతే దాన్ని మెచ్యూరిటీ సమయంగా నిర్ణయించారు. ఈ ఏడాది ఈ పథకంపై 9.2 శాతం వడ్డీ లభిస్తోంది. 10 ఏళ్ళలోపు పిల్లలు దీన్లో చేరడానికి అర్హులు.

 సుకన్య-సమృద్ధి తర్వాత రిస్క్‌లేని దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ పథకం అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ను చెప్పుకోవచ్చు. 15 ఏళ్ళ కాలపరిమితి ఉండే ఈ పథకంపై 8.7 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులూ ఉన్నాయి.

 పై రెండూ వద్దనుకున్నవారు పదేళ్ల కాలపరిమితి గల నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ కేసి చూడొచ్చు. దీనిపై 8.8 శాతం వడ్డీతో పాటు పన్ను మినహాయింపులు లభిస్తాయి. వీటితో పాటు ఇన్వెస్ట్ చేసిన మొత్తం రెట్టింపయ్యే కిసాన్ వికాస పత్రాలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత 8 ఏళ్ల నాలుగు నెలలకు మీ సొమ్ము రెట్టింపవుతుంది.

 ఇవన్నీ కాని పక్షంలో దీర్ఘకాలిక బ్యాంకు డిపాజిట్లు కూడా పరిశీలించొచ్చు. ఐదు అంతకంటే ఎక్కువ సంవత్సరాల కాలపరిమితి గల డిపాజిట్లపై ఇప్పుడు బ్యాంకులు 8-8.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి.
 
 పిల్లల భవిష్యత్తు..
 పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయాలంటే బీమా, పోస్టాఫీసు పథకాలు, బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ వంటి అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో దేన్నయినా ఎంచుకునే ముందు మీ లక్ష్యం... దాన్ని చేరుకోవడానికి పట్టే సమయం...  మీ రిస్క్ సామర్థ్యం... వంటివన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. సాధారణంగా పిల్లలకు 15 - 18 ఏళ్ళు దాటాకే భారీ మొత్తాలు కావాల్సి వస్తుంది కనక దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేయాలి.
 
 అత్యధికులు బీమావైపే...
 పిల్లల కోసం పొదుపు అనగానే ఠక్కున గుర్తుకొచ్చేవి బీమా పథకాలే. వీటికి బాగా డిమాండ్ ఉండటంతో  బీమా కంపెనీలు ఎప్పటికప్పుడు పలు కొత్త పథకాలను కూడా ప్రవేశపెడుతున్నాయి. పిల్లల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నవారిలో అత్యధికంగా 64 శాతం మంది బీమా పథకాలవైపే మొగ్గు చూపుతున్నారు.  ఈ మధ్యనే ఎల్‌ఐసీ చైల్డ్ కేర్, న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీలను ప్రవేశపెట్టింది. అలాగే ప్రైవేటు కంపెనీల్లో బిర్లా సన్‌లైఫ్ విజన్ స్టార్ ప్లాన్‌ను, పీఎన్‌బీ మెట్‌లైఫ్ సంస్థ స్మార్ట్ చైల్డ్‌ను, కోటక్ హెడ్‌స్టార్ట్ చైల్డ్ అష్యూర్‌ను అందుబాటులోకి తెచ్చాయి.
 
 మార్కెట్ లాభాల కోసం ఎంఎఫ్‌లు...

 వడ్డీరేట్లు తక్కువగా ఉండటం, ఇదే సమయంలో స్టాక్ మార్కెట్లు మంచి లాభాలు అందిస్తుండటంతో గత రెండేళ్లుగా పిల్లల ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఈక్విటీ సాధనాల కేసి మొగ్గుచూపే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి వారిని ఆకర్షించడం కోసం మ్యూచువల్ ఫండ్ సంస్థలు పిల్లల కోసం ప్రత్యేక పథకాలను అందిస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధిక రిస్క్ లేకుండా ఈక్విటీలు, డెట్ పథకాల్లో సమానంగా పెట్టుబడి పెట్టేలా ఈ పథకాలను తీర్చిదిద్దారు. కాబట్టి డైవర్సిఫైడ్ ఈక్విటీ పథకాలతో పోలిస్తే వీటిల్లో కొద్దిగా రిస్క్ తక్కువగా ఉంటుంది. ఇంకాస్త ఎక్కువ రిస్క్ చేసేవారికి ఈక్విటీ ఓరియెంటెడ్  చిల్డ్రన్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. 

టెంపుల్టన్ ఇండియా క్యాప్ గిఫ్ట్ ప్లాన్, హెచ్‌డీఎఫ్‌సీ చిల్డ్రన్ గిఫ్ట్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ చైల్డ్‌కేర్-గిఫ్ట్, యూటీఐ చిల్డ్రన్ కెరీర్ ప్లాన్- అడ్వాంటేజ్ వంటివి ఈ విభాగంలోకి వస్తాయి. అదే డెట్ ఓరియెంటెడ్ చైల్డ్ ఫండ్స్ విషయానికి వస్తే ఇవి దాదాపు 60 శాతం వరకు డెట్ పథకాల్లో, మిగిలిన మొత్తం ఈక్విటీలకు కేటాయిస్తాయి. టాటా యంగ్ సిటిజన్స్, ఎల్‌ఐసీ చిల్డ్రన్, మాగ్నం చిల్డ్రన్ బెనిఫిట్, యూటీఐ చిల్డ్రన్ కెరీర్ ప్లాన్ బ్యాలెన్స్‌డ్ వంటి పథకాలు ఈ విభాగంలోకి వస్తాయి. అలా కాక మీకు మరింత రిస్క్ సామర్థ్యం ఉంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు.
 
 పొదుపుతోనే లక్ష్య సాధన...
  చదువుల కోసం ఒకేసారి కోటి రూపాయలు కావాలంటే కష్టం. కానీ ఆర్థికాంశాల విషయంలో క్రమశిక్షణతో వ్యవహరిస్తే ఈ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. విద్యా వ్యయం ఏటా 12 శాతం పెరుగుతోంది కాబట్టి అంతకంటే ఎక్కువ రాబడినిచ్చే పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. పిల్లలు పుట్టిన వెంటనే ప్రతి నెలా పదివేలు కంటే తక్కువ ఇన్వెస్ట్ చేయడం ద్వారా పిల్లలు మేజర్లయ్యే సమయానికి కోటి రూపాయల నిధిని తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఈక్విటీలను పెట్టుబడిగా ఎంచుకోవచ్చు. ప్రతి నెలా మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.9,000 ఇన్వెస్ట్ చేస్తే 18 ఏళ్లకు మీ నిధి కోటి రూపాయలు దాటుతుంది. ఇక్కడ సగటు రాబడిని 15 శాతంగా లెక్కించడం జరిగింది. ఈ రాబడి ఇంకా పెరిగితే మీ చేతికొచ్చే మొత్తం మరింత పెరుగుతుంది. తగ్గితే ఆ మేరకు రాబడి తగ్గుతుంది.
 
 ఆర్థిక పాఠాలు నేర్పించాల్సిందే...
  పిల్లల అవసరాల కోసం ఇన్వెస్ట్ చేయడమే కాకుండా వారికి చిన్నప్పటి నుంచే డబ్బు విలువ తెలిసేలా వ్యవహరించాలి. వారికి ప్రతి నెలా ప్యాకెట్ మనీ ఇస్తూ దాన్ని ఏ విధంగా దాచుకోవాలో నేర్పించండి. ఇప్పుడు అన్ని బ్యాంకులూ చిన్న పిల్లలకు కూడా బ్యాంక్ ఖాతాలను అందిస్తున్నాయి. ఈ జూనియర్ ఖాతాలు ప్రారంభిస్తే వారికి నిజమైన బ్యాంకింగ్ అనుభవం వస్తుంది. బహుమతుల రూపం లో వచ్చే నగదును ఈ ఖాతాలో జమ చేయడం, అప్పుడప్పుడు బ్యాలెన్స్ ఎంతుందో చూడటం చేయిస్తూ  ఉంటే పిల్లలకు పొదుపు విలువ తెలిసొస్తుంది.

 ఈ జాగ్రత్తలు తప్పనిసరి...
  సాధ్యమైనంత త్వరగా ఇన్వెస్ట్‌మెంట్‌ను మొదలుపెట్టాలి.
  పిల్లలు పుట్టాక తల్లిదండ్రులు అధిక మొత్తానికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.
  పోర్ట్‌ఫోలియోలో అధిక భాగం ఈక్విటీలకు కేటాయించాలి.
  ఎంచుకున్న పథకం మీ లక్ష్యానికి అనువుగా ఉందో లేదో పరిశీలించండి.
 
 చదువుకోసమే పొదుపు...

  పిల్లల కోసం రకరకాల పొదుపు చేస్తున్న పలువురితో ఈ మధ్య ఓ ప్రయివేటు బీమా సంస్థ సర్వే చేసింది. సర్వేలో చాలా ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. అవేంటంటే పిల్లలకోసం పొదుపు చేస్తున్నవారిలో 77 శాతం మంది పిల్లల చదువుకోసం  చేస్తుండగా... 23 శాతం మంది మాత్రమే వారి పెళ్లి కోసం చేస్తున్నారట!. విద్యా వ్యయం ఏటా 10 శాతం చొప్పున పెరుగుతోందని, దీంతో పిల్లలకు సరైన చదువు చెప్పించగలమా? లేదా? అనే భయం వెంటాడుతోందని పలువురు అభిప్రాయపడ్డారు.

ఈ ఆందోళనకు అనుగుణంగానే వారి ఇన్వెస్ట్‌మెంట్ విధానంలోనూ మార్పులొచ్చాయి. గతంలో పిల్లల కోసం ఎలాంటి రిస్క్ లేని పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపిన వారిలో చాలా వరకూ... గత రెండేళ్లుగా బీమా, డిపాజిట్లు, బంగారం వంటి సంప్రదాయ పెట్టుబడి విధానాలకన్నా షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, రియల్ ఎస్టేట్ వంటి రిస్కు-రాబడి రెండూ ఎక్కువగానే ఉండే సాధనాలవైపు మొగ్గు చూపిస్తున్నారు. అదీ కథ.
 
 విద్యా వ్యయం పెరుగుతోందిలా...
  ఇప్పుడు కాస్త మంచి కాలేజీలో డొనేషన్లు లేకుండా నాలుగేళ్ల ఇంజనీరింగ్ విద్య పూర్తి చేయాలంటే సుమారు రూ.6 లక్షలు ఖర్చవుతోంది. ఇక డొనేషన్లుంటే దాన్ని లెక్కించటం చాలా కష్టం. ఇదే సమయంలో విద్యావ్యయం ఏటా 10 నుంచి 12 శాతం పెరుగుతోంది. ఈ లెక్కన  చూస్తే ఆరేళ్ల తర్వాత ఇదే కోర్సును పూర్తి చేయడానికి రూ.12 లక్షలు అవసరమవుతుంది. అదే 12 ఏళ్ల తర్వాతయితే రూ.24 లక్షలు చేతిలో ఉండాల్సిందే. 18 ఏళ్ల తరవాతైతే రూ.34 లక్షలు కావాలి. వివిధ కోర్సుల ఫీజులు భవిష్యత్తులో 10 శాతం చొప్పున పెరిగితే ఎంత ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement