
ఎస్‌బీఐ బాదుడు షురూ..
ఒక వంకేమో పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేసి... వాటి బదులుగా తక్కువ స్థాయిలో నగదు అందుబాటులోకి తెచ్చారు.
♦ ఖాతాల్లో ఎక్కువ డబ్బులుండేవారికి మినహాయింపు
♦ కనీస బ్యాలెన్స్ రూ. 25వేలు దాటితే ఎన్ని లావాదేవీలైనా ఫ్రీ
♦ అంతకన్నా తక్కువుంటే మాత్రం పరిమితులు.. భారీగా చార్జీల వడ్డన
♦ ఆన్‌లైన్ లావాదేవీలు కూడా నెలకు 40 మాత్రమే ఉచితం
♦ చిరిగిన నోట్లు మార్చాలన్నా డబ్బు కట్టాల్సిందే
♦ పొదుపును ప్రోత్సహించటానికేనంటూ అధికారుల విచిత్ర భాష్యం
అమరావతి, సాక్షి బిజినెస్ ప్రతినిధి
ఒక వంకేమో పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేసి... వాటి బదులుగా తక్కువ స్థాయిలో నగదు అందుబాటులోకి తెచ్చారు. ‘‘ఇంతకు ముందు మాదిరిగా ప్రతి లావాదేవీనీ క్యాష్‌తో చేస్తామంటే కుదరదు. క్యాష్ తక్కువ ఉంటుందని ఎప్పుడూ గుర్తుంచుకోండి. వీలైనంత వరకూ డిజిటల్ లావాదేవీలే జరపండి’’ అనేది ప్రధానితో సహా దాదాపు ప్రతి మంత్రీ, అధికారీ చెప్పిన మాట. జనం కూడా విధిలేక డిజిటల్ బాట పట్టారు. ఇదే అదనుగా పుంఖాను పుంఖాలుగా డిజిటల్ వాలెట్లు పుట్టుకొచ్చాయి. మన డబ్బుకు సరైన భద్రత ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఆయా వాలెట్ల ద్వారా డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తూనే ఉన్నాం.
ఇంతలో మరో పిడుగు పడింది. దేశంలో అత్యధికులు వినియోగించే ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... ప్రతి లావాదేవీకీ పరిమితిని విధిస్తూ... డిజిటల్ లావాదేవీలు జరిపేవారిని కూడా నడ్డి విరిచే కార్యక్రమానికి తెరతీసింది. ముఖ్యంగా ఆరు రకాల లావాదేవీలపై ఎస్‌బీఐ విధించిన పరిమితులు, చార్జీలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ పరిమితులను దాటి వినియోగిస్తే లావాదేవీలపై చార్జీలు, సేవా పన్ను రూపంలో ఖాతాదారుడి జేబు గుల్లవటం ఖాయం.
దేశీయ అతిపెద్ద బ్యాంకే ఈ విధంగా చార్జీలను అమలు చేస్తుండటంతో ఇదే బాటను అనుసరించడానికి ఇతర బ్యాంకులు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఎస్‌బీఐ చార్జీలపై వచ్చిన స్పందన చూశాక అమలు చేయాలన్నది వీటి ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బడాబాబులకు రుణాలిచ్చి వాటిని వసూలు చేసుకోలేక ఎన్‌పీఏలుగా ప్రకటిస్తున్న బ్యాంకులు... ఆదాయం పెంచుకోవటానికి ఇలాంటి కొత్త మార్గాల్ని ఎంచుకుంటున్నట్లున్నాయి. కొత్తగా అమల్లోకి వచ్చిన ఎస్‌బీఐ చార్జీల వివరాలివీ...
ఏటీఎం లావాదేవీలపై..
ఉచిత ఏటీఎం లావాదేవీలను ఇప్పుడు కనీస నిల్వలతో అనుసంధానం చేశారు. ఖాతాలో ప్రతి నెలా నిల్వ ఉన్న సగటు ఆధారంగా ఈ చార్జీలను విధిస్తారు. కనీస నిల్వ రూ.25,000 దాటి ఉంటే లావాదేవీలపై ఎటువంటి పరిమితులూ ఉండవు. సాధారణ సేవింగ్ అకౌంట్స్‌పై మెట్రో నగరాల్లో అయితే ప్రతి నెలా 8 లావాదేవీలు (ఎస్‌బీఐ ఏటీఎంలలో 5 + ఇతర బ్యాంకుల ఏటీఎంలలో 3) ఉచితం. అదే నాన్ మెట్రో పట్టణాలు అయితే 10 లావాదేవీల (5 ఎస్‌బీఐ ఏటీఎం, 5 ఇతర బ్యాంకుల ఏటీఎంలు) వరకు ఉచితం. ఈ ఏటీఎం లావాదేవీలు కాకుండా ప్రతి నెలా బ్యాంకు శాఖ నుంచి రెండుసార్లు ఉచితంగా నగదు తీసుకోవచ్చు. ఇక ఆన్‌లైన్లో అయితే నెలకు 40 లావాదేవీలు మాత్రమే ఉచితంగా నిర్వహించుకోవచ్చు. ఇవి దాటితే మాత్రం... చార్జీల వడ్డన తప్పదు. సాధారణ బ్యాంకు ఖాతాదారులు ఈ పరిమితులకు లోబడే లావాదేవీలు చేస్తుంటారని, అందుకని తాజా నిబంధనలతో వారికెలాంటి ఇబ్బందీ ఉండదనేది బ్యాంకు అధికారుల మాట.
బేసిక్ సేవింగ్ ఖాతాలైతే...
గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు లావాదేవీలు పెంచడానికి ప్రారంభించిన బేసిక్ సేవింగ్స్ ఖాతాలైతే చార్జీల ప్రభావం కాస్త ఎక్కువే పడుతుంది. బేసిక్ ఖాతా ఉన్న వారు నెలలో నాలుగు సార్లు (ఏటీఎంతో కలిపి) ఉచితంగా నగదు తీసుకోవచ్చు. ఈ పరిమితి దాటితే నేరుగా బ్యాంకు శాఖ నుంచి తీసుకుంటే రూ. 50 చార్జీ వేస్తారు. అదే ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి అయితే రూ. 20, ఎస్‌బీఐ ఏటీఎం నుంచి అయితే రూ. 10 చెల్లించాలి. ఈ రుసుములకు సేవా పన్ను అదనం. గ్రామీణ ప్రాంతాల్లో పొదుపును ప్రోత్సహించడానికే విత్‌డ్రాయల్స్‌పై పరిమితులు విధించినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు!!.
బడ్డీ వాలెట్ మరింత భారం
ఎస్‌బీఐ ప్రవేశపెట్టిన బడ్డీ వాలెట్‌ను ఉపయోగించి ఏటీఎం ద్వారా నగదు విత్‌డ్రా చేసుకుంటే రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే బిజినెస్ కరస్పాండెంట్ల (బీసీ) ద్వారా వాలెట్‌లో నగదు జమ చేస్తే.. ఆ విలువపై 0.25 శాతం చార్జీ చెల్లించాలి. ఈ చార్జీని కనిష్టంగా రూ.2, గరిష్టంగా రూ.8గా నిర్ణయించారు. అదే విధంగా బీసీల ద్వారా వాలెట్‌లోని నగదును తీసుకోవాలంటే రూ. 2,000లోపు నగదుకు కనీస చార్జీ 6గా విధించారు. ఆపై మొత్తానికి విలువలో 2.5 శాతం చార్జీ చెల్లించాల్సి వుంటుంది. అంటే రూ.10వేలు తీసుకుంటే రూ.250 చెల్లించాలన్న మాట.
ఆన్‌లైన్ నగదు బదిలీపై...
తక్షణం నగదు బదిలీకై వినియోగించే ఐఎంపీఎస్ సేవలపై కూడా ఎస్‌బీఐ పరిమితులను విధించింది. ఐఎంపీఎస్ విధానంలో పంపించే లక్ష రూపాయల లోపు మొత్తంపై రూ.5 చార్జీ, సేవా పన్ను చెల్లించాల్సి వస్తుంది. రూ.1 లక్ష నుంచి రూ. 2 లక్ష లోపు లావాదేవీలపై రూ.15, ఆపైన రూ.5 లక్షలలోపు రూ.25 చార్జీ చెల్లించాలి.
ఏటీఎం కార్డుల జారీ
కొత్తగా జారీ చేసే ఏటీఎం కార్డులపై కూడా చార్జీలను వసూలు చేస్తోంది. కానీ ఖాతాదారులు రూపే క్లాసిక్ కార్డు తీసుకుంటే ఎటువంటి చార్జీలు ఉండవు. అలా..కాకుండా వీసా, మాస్టర్ వంటి ఇతర కార్డులు తీసుకుంటే మాత్రం అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
చెక్‌బుక్కుల జారీ..
ఇక నుంచి కొత్త చెక్‌బుక్ తీసుకోవాలన్నా డబ్బులు కట్టాల్సిందే. 10 కాగితాలు ఉండే చెక్‌బుక్ అయితే రూ.30, అదే 25 కాగితాలుంటే రూ.75, ఇంకా పెద్దది 50 చెక్కులు ఉండే పుస్తకమయితే రూ.150 చెల్లించాలి. ఈ రుసుములకు సేవాపన్ను అదనం.
చిరిగిన నోట్లు మారిస్తే...
చిరిగిన, చెల్లని పాతనోట్లను మార్చుకోవాలన్నా చార్జీలు కట్టాల్సిందే. కానీ ఇక్కడ ఎస్‌బీఐ కొన్ని మినహాయింపులను ఇచ్చింది. 20 నోట్లు లేదా విలువ రూ. 5,000 దాటకుండా ఉంటే ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అదే 20 నోట్లు దాటితే ప్రతీ నోటుపై రూ.2 చార్జీ చెల్లించాలి. అలా కాకుండా విలువ రూ.5,000 దాటితే నోటుకు రూ.2 లేదా ప్రతీ రూ.1,000లకు రూ.5 ఈ రెండింటిలో ఈ మొత్తం అధికమైతే ఆ మొత్తాన్ని చార్జీగా వసూలు చేస్తారు.