సాక్షి,ముంబై: దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తాజా మానిటరీ పాలసీ రివ్యూ అనంతరం తన ఎంసీఎల్‌ఆర్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని రుణాలపై 5 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటు తగ్గింపును శుక్రవారం ప్రకటించింది. ఫిబ్రవరి 10 నుంచి ఈ రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంసీఎల్‌ఆర్‌లో ఎస్‌బీఐ ప్రకటించిన వరుసగా తొమ్మిదవ కోత ఇది.
ఈ తగ్గింపుతో, ఫండ్-బేస్డ్ రేట్ (ఎంసిఎల్ఆర్) ఒక సంవత్సరం ఉపాంత వ్యయం 7.90 శాతం నుండి సంవత్సరానికి 7.85 శాతానికి తగ్గిందని బ్యాంకు ప్రకటన తెలిపింది. ఆర్‌బీఐ రెపో రేటును 5.15 శాతం, రివర్స్‌రెపోను 4.90 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. అయితే బ్యాంకుల రుణాల రేట్లను తగ్గించేందుకు వీలుగా రూ. లక్ష కోట్ల వరకు దీర్ఘకాలిక రెపో ఆపరేషన్‌ను ప్రకటించడంతో ఈ ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
అలాగే మిగులు ద్రవ్యత దృష్ట్యా, టర్మ్ డిపాజిట్లపై బ్యాంకు చెల్లించే వడ్డీరేటుపై కూడా కోత విధించింది. టర్మ్ డిపాజిట్ల రేట్లను రిటైల్ విభాగంలో 10-50 బీపీఎస్ పాయింట్లు, బల్క్ విభాగంలో 25-50 బిపిఎస్ తగ్గించింది. రిటైల్ టర్మ్ డిపాజిట్లు (రూ. 2 కోట్ల కన్నా తక్కువ), బల్క్ టర్మ్ డిపాజిట్లు (రూ. 2 కోట్లు మరియు అంతకంటే ఎక్కువ) పై సవరించిన వడ్డీ రేటున ఫిబ్రవరి 10నుంచి అమలవుతుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment