పాకిస్తాన్ సంస్థ ద్వారా ఇన్వెస్టర్లకు టోపీ
గుట్టువిప్పిన సెబీ
ముంబై: పాకిస్తాన్‌లో రిజిష్టర్ అయిన ఒక సంస్థ ఇచ్చిన మోసపూరిత ఎస్‌ఎంఎస్‌లతో భారత్ స్టాక్‌మార్కెట్లో ఇన్వెస్టర్లు దెబ్బతిన్న ఉదంతమిది. ఇది బట్టబయిలుకావడంతో మార్కెట్ నియంత్రణా సంస్థ ఇక్కడ లిస్టయిన ధాన్యా ఫిన్‌స్టాక్ కంపెనీతో పాటు మరో 75 మందిని మార్కెట్ కార్యకలాపాల నుంచి నిషేధించింది. బీఎస్‌ఈని తలపింపచేలా ‘బీఎస్‌ఈబుల్.ఇన్’ అనే పేరుపెట్టుకున్న పాక్ సంస్థ ధాన్యా ఫిన్‌స్టాక్‌ను కొనమంటూ ఇక్కడి ఇన్వెస్టర్లకు సిఫార్సు ఎస్‌ఎంఎస్‌లు ఇచ్చింది.
స్వయంగా బీఎస్‌ఈ నుంచే ఈ మెసేజ్‌లు వచ్చాయన్న విశ్వాసంతో గతేడాది జూలై 27న పలువురు ఇన్వెస్టర్లు ధాన్యా ఫిన్‌స్టాక్‌ను కొనుగోలుచేశారు. అంతకుముందే ఆ కంపెనీ నుంచి ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ ద్వారా పొందిన షేర్లను ఆ కంపెనీ యాజమాన్యానికి చెందినవారు విక్రయించేశారు. దాదాపు రూ. 5 కోట్ల పెట్టుబడితో పొందిన షేర్లను రూ. 107 కోట్లకు విక్రయించారు. ఆ రోజు కొన్న ఇన్వెస్టర్లు మరునాడు ఆ షేర్లను తిరిగి అమ్మడానికి ప్రయత్నిస్తే దాని ధర పతనమైపోయింది.