
సోషల్ మీడియాలో స్కామ్‌పై అమెరికాకు సెబీ సహకారం
ప్రాఫిట్ ప్యారడైజ్ పేరుతో ఇన్వెస్టర్లకు టోకరా
పథకాన్ని నిర్వహించిన ఇద్దరు భారతీయులు
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ఒక స్కామ్‌పై దర్యాప్తు అంశంలో యూఎస్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్(ఎస్‌ఈసీ)కు దేశీ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సహకారాన్ని అందించింది. సామాజిక మాధ్యమ(సోషల్ మీడియా) ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నడుస్తున్న ప్రాఫిట్ ప్యారడైజ్ అనే పొంజి పథకానికి చెక్ పెట్టే బాటలో ఎస్‌ఈసీతో సెబీ చేతులు కలిపింది. ప్రాఫిట్ ప్యారడైజ్ స్కామ్‌ను ఇద్దరు భారతీయులు నిర్వహిస్తుండటంతో కేసు ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఒకరు ముంబైనుంచి, మరొకరు హైదరాబాద్ నుంచి ‘అత్యధిక లాభాలిచ్చే పెట్టుబడుల ప్రొడక్ట్(హెచ్‌వైఐపీ)’ పేరుతో ఈ పథకాన్ని నిర్వహించారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, యూట్యూబ్ వంటి సైట్ల ద్వారా ఈ పథకాలకు భారీ ప్రచారాన్ని కల్పించడం ద్వారా అమాయక ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నారు. తక్కువ కాలంలోనే గరిష్ట లాభాలు అంటూ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను సమీకరించారు. ఈ బాటలో తాజాగా ప్రాఫిట్ ప్యారడైజ్ పేరుతో ఇన్వెస్టర్ల నుంచి డిపాజిట్లను ఆహ్వానించారు.
ఇలా అత్యధిక శాతం మంది నుంచి పెట్టుబడులను సమీకరించడం ద్వారా ఒక నిధిని ఏర్పాటు చేసి ఫారెక్స్, షేర్లు, కమోడిటీలలో ట్రేడింగ్ ద్వారా భారీ లాభాలను ఆర్జించడమనేది పథకం ప్రణాళిక. ఇండియా నుంచి ఈ పథకాలను నిర్వహిస్తున్నప్పటికీ, వెబ్‌సైట్ రిజిస్ట్రేషన్‌తోపాటు, కార్యాలయాలను అమెరికాలో ఏర్పాటు చేసినట్లు ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించారు.
అయితే ఈ కేసు దర్యాప్తులో ఇండియా, కెనడా, హాంకాంగ్‌ల సహకారాన్ని ఎస్‌ఈసీ అర్థించింది. దర్యాప్తు పూర్తయ్యాక ఇద్దరు భారతీయులు పంకజ్ శ్రీవాస్తవ, నటరాజ్ కావూరిలపై కేసులు పెట్టింది. ఈ అంశంలో సెబీ సహకారాన్ని ఎస్‌ఈసీ ప్రశంసించింది. రెండు సంస్థలూ అంతర్జాతీయ సెక్యూరిటీస్ కమిషన్ సమితి(ఐవోఎస్‌సీవో)లో సభ్యులు కావడం గమనార్హం.