రీట్స్ నిబంధనల సరళీకరణ!
♦ మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యం
♦ విదేశీ ఫండ్ మేనేజర్ల నిబంధనల కూడా సరళీకరణ
♦ రెండు సంప్రదింపుల పత్రాలు విడుదల చేసిన సెబీ
ముంబై: రీట్స్(రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్) నిబంధనలను, విదేశీ ఫండ్ మేనేజర్లు సంబంధించిన నిబంధనలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సరళీకరించనున్నది. భారత క్యాపిటల్ మార్కెట్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సెబీ ఈ నిర్ణయాలు తీసుకుంది. ఇన్వెస్టర్లు, రియల్టర్లను ఆకర్షించడమే లక్ష్యంగా రీట్స్ నిబంధనలను సరళీకరించనున్నది. విదేశీ ఫండ్ మేనేజర్లకు సంబంధించిన నిబంధనల సరళీకరణ కారణంగా మరిన్ని విదేశీ ఫండ్‌లు మన దేశంలో కార్యకలాపాలు ప్రారంభిస్తాయని అంచనా. రీట్స్, విదేశీ ఫండ్ మేనేజర్లకు సంబంధించిన నిబంధనల సరళీకరణపై రెండు వేర్వేరు సంప్రదింపుల పత్రాలను సెబీ విడుదల చేసింది. ఈ సంప్రదింపుల పత్రాలపై వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని తుది నిబంధనలను రూపొందిస్తుంది. శుక్రవారం జరిగిన బోర్డ్ సమావేశంలో ఈ మేరకు సెబీ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలోనే 2015-16 సెబీ వార్షిక నివేదిక కూడా ఆమోదం పొందింది.
20 శాతం పెట్టుబడులకు ఓకే ...నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో రీట్స్ ప్రస్తుతం తన నిధుల్లో 10 శాతం వరకూ పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ పరిమితిని 20 శాతం వరకూ పెంచాలని సెబీ ప్రతిపాదిస్తోంది. రీట్స్‌కు స్పాన్సరర్ల సంఖ్యను మూడు నుంచి ఐదుకు పెంచింది. రీట్స్‌పై సెబీ తాజా ప్రతిపాదనల పట్ల సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. ఈ నిబంధనల కారణంగా ఏడాదిలోపు రీట్స్ వస్తాయని నిపుణులంటున్నారు. ఈ ప్రతిపాదనల వల్ల రీట్స్ నుంచి భారత రియల్టీ మార్కెట్లో అవసరమైన నిధులు వస్తాయని సీబీఆర్‌ఈ సౌత్ ఏషియా సీఎండీ అన్షుమన్ మ్యాగజైన్ చెప్పారు.
మరోవైపు భారత్‌లో నియమితులయ్యే విదేశీ ఫండ్ మేనేజర్లకు సంబంధించిన నిబంధనలను కూడా సెబీ సరళీకరించనున్నది. విదేశీ ఫండ్ మేనేజర్లు పోర్ట్‌ఫోలియో మేనేజర్లుగా వ్యవహరించడానికి వీలుగా నిబంధనలను సరళీకరించాలని సెబీ ప్రతిపాదిస్తోంది.