ముంబై: గరిష్ట స్థాయిల్లో అమ్మకాలతో మార్కెట్లు స్వల్పంగా నష్టపోయాయి. దీంతో ఐదు రోజుల వరుస లాభాలకు బుధవారం బ్రేక్ పడింది. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్షియల్ స్టాక్స్‌లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించినట్టు మార్కెట్ డేటా ఆధారంగా తెలుస్తోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 59 పాయింట్లు నష్టపోయి 37,872 వద్ద క్లోజ్ అవగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 11,133 వద్ద ముగిసింది. క్రితం రోజు హిందుస్తాన్ యూనిలీవర్ జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించగా.. ఈ కౌంటర్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో 3 శాతం నష్టపోయింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ లాభం 6 శాతం పెరగడం గమనార్హం.
టాటా స్టీల్, మారుతి, ఇండస్‌ఇండ్ బ్యాంకు, ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టీ, టీసీఎస్, ఏషియన్ పెయిం ట్స్ అధికంగా నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. మెరుగైన ఫలితాల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంకు స్టాక్ 7% ర్యాలీ చేసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సంకేతాలు బలహీనంగా ఉండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్టు అనలిస్టులు పేర్కొన్నారు. హూస్టన్‌లోని కాన్సులేట్‌ను మూసేయాలంటూ చైనాను అమెరికా కోరడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత రా జుకున్నాయి. హాంగ్‌కాంగ్, సియోల్, టోక్యో మా ర్కెట్లు నష్టపోగా, షాంఘై సానుకూలంగా ట్రేడ్ అయింది. కాగా, గురువారం ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల ముగింపు కావడంతో అస్థిరతలు కొనసాగొచ్చు అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు.
ఆర్‌ఐఎల్ కొత్త రికార్డు
రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) మార్కెట్ విలువ సరికొత్త గరిష్టాలకు చేరుకుంది. కంపెనీ షేరు 1.64 శాతం లాభపడి రూ.2,004 వద్ద బీఎస్‌ఈలో క్లోజయింది. దీంతో ఆర్‌ఐఎల్ మార్కెట్ విలువ రూ.12,70,480 కోట్లకు పెరిగింది. ఆర్‌ఐఎల్ స్టాక్ ఇంట్రాడేలో బీఎస్‌ఈలో రూ.2,010 వరకు పెరగడం గమనార్హం.
పెరిగిన రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం: సెబీ చీఫ్ త్యాగి
న్యూఢిల్లీ: లాక్‌డౌన్ నుంచి ఈక్విటీ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరిగినట్టు సెబీ చైర్మన్ అజయ్ త్యాగి తెలిపారు. బుధవారం ఫిక్కీ నిర్వహించిన ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గడిచిన కొన్ని నెలల్లో నూతన డీమ్యాట్ అకౌంట్ల ప్రారంభం గణనీయంగా పెరిగిందని, ఇందులో మొదటిసారి ఇన్వెస్టర్లు ఎక్కువ మందే ఉన్నట్టు త్యాగి వెల్లడించారు. మొదటి సారి పెట్టుబడులు పెట్టే వారు రిస్క్‌లేని ప్రభుత్వ సెక్యూరిటీలతో (జీ–సెక్) ప్రారంభించడం అనుకూలంగా ఉంటుందని సూచించారు. ఇందుకు జీసెక్‌లను డీమ్యాట్ రూపంలో జారీ చేయాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. మార్చి షాక్ నుంచి మార్కెట్లు గణనీయంగా రికవరీ అయినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment