
స్టాక్ సూచీల్లో వెయిటేజీ అధికంగా గల షేర్లలో కొనుగోళ్ల జోరు కారణంగా బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. దీంతో రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. కరోనా వైరస్ భయాల నుంచి ప్రపంచ మార్కెట్లు కోలుకోవడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశ నిర్ణయాలు సానుకూలంగా ఉండగలవనే అంచనాలు, రానున్న బడ్జెట్‌లో వృద్ధి జోరు పెంచే చర్యలు ఉండగలవన్న ఆశలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడం... సానుకూల ప్రభావం చూపాయి. జనవరి సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు చోటు చేసుకోవడం కలసివచ్చింది. ముడి చమురు ధరలు 0.7 శాతం ఎగసినా మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 232 పాయింట్ల లాభంతో 41,199 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 74 పాయింట్ల లాభంతో 12,130 పాయింట్ల వద్ద ముగిశాయి.
రోజంతా లాభాలే.....
సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. రోజంతా లాభాలు కొనసాగాయి. సూచీల్లో వెయిటేజీ అధికంగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 368 పాయింట్ల మేర లాభపడింది. రికార్డ్ స్థాయి నికర లాభం సాధించడంతో బజాజ్ ఫైనాన్స్ షేర్ 5 శాతం లాభంతో రూ.,4,422 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే.
ప్రపంచ మార్కెట్ల రికవరీ....
యాపిల్ కంపెనీ రికార్డ్ స్థాయి లాభాలు, ఆదాయాన్ని ఆర్జించడం, అమెరికాలో వెల్లడైన ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండటంతో మంగళవారం అమెరికా మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. ఈ దన్నుతో బుధవారం ఆసియా మార్కెట్లు కూడా లాభపడ్డాయి. జపాన్ నికాయ్, దక్షిణ కొరియా కోస్పీ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెలవుల అనంతరం ఆరంభమైన హాంగ్‌కాంగ్ సూచీ 2% మేర నష్టపోయింది. కొత్త ఏడాది సెలవుల కారణంగా చైనా మార్కెట్లు పనిచేయలేదు. యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment