
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే 300 పాయింట్లకు పైగా కుప్పకూలాయి. కానీ వెంటనే పుంజుకుని స్వల్ప లాభాల్లోకి మళ్లాయి. తిరిగి అమ్మకాల ధోరణి నెలకొంది. ఇలా లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్న సెన్సెక్స్ 55 పాయింట్ల లాభంతో 30434 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 8953 వద్ద ట్రేడ్ అయింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో బలహీనపడిన సెన్సెక్స్ 220 పాయింట్లు కోల్పోవడం గమనార్హం. బ్యాంకింగ్, ఐటీ రంగంలో ఒత్తిడి కొనసాగుతుండగా, ఫార్మా, ఎఫ్ ఎంసీజీ లాభాల్లో ఉన్నాయి. టెక్ మహీంద్ర, కోటక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, యాక్సిస్ , టీసీఎస్, హీరో మోటో, టైటన్, ఐషర్ మోటార్స్ భారీగా నష్టపోతుండగా వేదాంతా, యూపీఎల్, లార్సెన్, హిందాల్కో, జీ, పవర్ గ్రిడ్, గెయిల్, రిలయన్స్ లాభపడుతున్నాయి.