ఐదో రోజూ నష్టాలే...
మార్కెట్ అప్‌డేట్
- 71 పాయింట్లు మైనస్
- 26,710 వద్దకు సెన్సెక్స్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపట్ల ఆందోళనల నేపథ్యంలో వరుసగా ఐదో రోజు మార్కెట్లు నష్టపోయాయి. సెన్సెక్స్ 71 పాయింట్లు క్షీణించి 26,710 వద్ద ముగిసింది. అయితే రోజు మొత్తం పలుమార్లు హెచ్చుతగ్గులకు లోనైంది. తొలుత 300 పాయింట్లు పతనంకాగా, మరో దశలో 90 పాయింట్లమేర లాభపడింది కూడా. వెరసి కనిష్టంగా 26,469, గరిష్టంగా 26,872ను తాకింది.
చివరికి రెండు నెలల కనిష్టంవద్ద నిలిచింది. ఇక నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 8,000 పాయింట్ల కీలకస్థాయిని కోల్పోయింది. చివరికి కొంత కోలుకుని 38 పాయింట్ల నష్టంతో 8,030 వద్ద స్థిరపడింది. కాగా, గత ఐదు రోజుల్లో సెన్సెక్స్ 1,121 పాయింట్లు నష్టపోగా, ఈ నెలలో ఇప్పటివరకూ 1,984 పాయింట్లు(7%) కోల్పోయింది.