'రికార్డు' తర్వాత 110 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్!
ద్రవ్యోల్బణ, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్లు ముందు జాగ్రత్తగా లాభాల స్వీకరణకు ఒడిగట్టారు
హైదరాబాద్: ద్రవ్యోల్బణ, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్లు ముందు జాగ్రత్తగా లాభాల స్వీకరణకు ఒడిగట్టారు. పవర్, మెటల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాల కంపెనీ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. విదేశీ మార్కెట్లలో మిశ్రమ స్పందన, మే మాసానికి సంబంధించిన వాణిజ్య లోటు పెరిగిపోవడమనే అంశాల కారణంగా బుధవారం సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి.
ఓ దశలో ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 25735 పాయింట్ల రికార్డు గరిష్ట స్థాయిని తాకింది. అయితే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరించడంతో ఆరంభంలో సాధించిన లాభాలను నిలుపుకోలేక సెన్సెక్స్ నష్టాల్లోకి జారుకుంది. దాంతో 25,365 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసుకుని.. చివరికి 25,473 పాయింట్ల వద్ద ముగిసింది. మరో ప్రధాన సూచీ నిఫ్టీ 29 పాయింట్లు కోల్పోయి 7626 పాయింట్ల వద్ద ముగిసింది.
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో ఇన్పోసిస్ 3.84 శాతం, కొటాక్ మహీంద్ర 3.16, టీసీఎస్ 2.26, డాక్టర్ రెడ్డీస్ 1.54, హీరో మోటో కార్ప్ 1.47 శాతం లాభాల్ని నమోదు చేసుకోగా, డీఎల్ఎఫ్ అత్యధికంగా 5.29 శాతం నష్టపోగా, టాటా పవర్ 4.93, హిండాల్కో 4.18, ఎన్ ఎం డీసీ 3.87, కోల్ ఇండియా 3.83 శాతం మేరకు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.