బొగ్గు సంస్కరణల జోష్
146 పాయింట్లు అప్
26,576 వద్దకు సెన్సెక్స్
వారం రోజుల గరిష్టం
లాభాల్లో పవర్, మెటల్
బొగ్గు క్షేత్రాల కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు మార్కెట్లకు ప్రోత్సాహాన్నిచ్చాయ్. దీంతో పవర్, మెటల్, బ్యాంకింగ్ షేర్లు వెలుగులో నిలిచాయి. ప్రభుత్వ సంస్థలకు నేరుగానూ, ప్రయివేట్ రంగ కంపెనీలకు ఈవేలం ద్వారానూ బొగ్గు గనుల కేటాయింపును చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేయనుండటంతో సెంటిమెంట్ మెరుగుపడింది. ఇందుకు ఎఫ్‌ఐఐలు మళ్లీ కొనుగోళ్లబాట పట్టడం కూడా జత కలిసింది. వెరసి సెన్సెక్స్ మరోసారి లాభాలతో మొదలైంది.
ఆపై 26,615 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. అయితే మిడ్ సెషన్‌లో ఉన్నట్టుండి అమ్మకాలు పెరగడంతో లాభాలు పోగొట్టుకున్నప్పటికీ, చివర్లో మళ్లీ పురోగమించింది. ట్రేడింగ్ ముగిసేసరికి 146 పాయింట్ల లాభంతో 26,576 వద్ద ముగిసింది. ఇది వారం రోజుల గరిష్టంకాగా, నిఫ్టీ సైతం 48 పాయింట్లు బలపడి 7,928 వద్ద నిలిచింది. వరుసగా మూడు రోజుల్లో సెన్సెక్స్ 576 పాయింట్లు జమ చేసుకుంది.
జిందాల్ స్టీల్ జోరు: మెటల్ షేర్లలో జిందాల్ స్టీల్ అత్యధికంగా 7.5% జంప్‌చేయగా, సెన్సెక్స్ దిగ్గజాలు గెయిల్, సెసాస్టెరిలైట్, భెల్, విప్రో, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ, మారుతీ, భారతీ 4.5-2.5% మధ్య పుంజుకున్నాయి. ఇక రియల్టీ షేర్లు శోభా, డీఎల్‌ఎఫ్, ఒబెరాయ్, గోద్రెజ్, ఇండియాబుల్స్, ఫీనిక్స్ 6.5-2.5% మధ్య దూసుకెళ్లడంతో రియల్టీ ఇండెక్స్ అత్యధికంగా 2.6% లాభపడింది. కాగా, మరోవైపు బ్లూచిప్స్ ఓఎన్‌జీసీ, ఎం అండ్‌ఎం, కోల్ ఇండియా 2.5-1.5% మధ్య నష్టపోయాయి.