మార్కెట్ కు బడ్జెట్ బూస్ట్.. | Sensex vaults 777 pts in biggest single-day gain in nearly 7 yrs; investor wealth up Rs 2.52 lakh cr | Sakshi
Sakshi News home page

మార్కెట్ కు బడ్జెట్ బూస్ట్..

Published Wed, Mar 2 2016 1:12 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 PM

మార్కెట్ కు బడ్జెట్ బూస్ట్..

మార్కెట్ కు బడ్జెట్ బూస్ట్..

బడ్జెట్ తరువాతి రోజు అతిపెద్ద ర్యాలీ... ఇదే
సెన్సెక్స్ 777 పాయింట్లు జూమ్.. 23,779 వద్ద ముగింపు
ఒకే రోజు ఇంతలా లాభపడటం ఏడేళ్లలో ఇదే తొలిసారి...
235 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ; 7,222 వద్ద క్లోజ్
వడ్డీరేట్ల కోతపై పెరిగిన ఆశలు; చైనా పాలసీ ఉద్దీపన ప్రభావం కూడా
ఒక్కరోజే రూ.2.5 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

 అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు... ఆర్‌బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న ఆశలు దేశీ స్టాక్ మార్కెట్లను పరుగులు పెట్టించాయి. ద్రవ్యలోటు కట్టడి లక్ష్యానికి కట్టుబడతామని బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించడం దీనికి ప్రధాన కారణం. మరోపక్క... చైనా సెంట్రల్ బ్యాంక్ పాలసీ సడలింపుతో ప్రపంచ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరిగింది. ఈ పరిణామాల ప్రభావంతో సెన్సెక్స్ 777 పాయింట్లు దూసుకెళ్లింది. భారత్ స్టాక్ మార్కెట్ చరిత్రలో బడ్జెట్ తర్వాత ఇంత భారీ ర్యాలీ ఇదే తొలిసారి. అంతేకాదు, గడిచిన ఏడేళ్లలో ఒక్కరోజులో సెన్సెక్స్ ఇంతలా లాభపడటం కూడా ఇదే మొదటిసారి. మొత్తంమీద మంగళవారం ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ.2.5 లక్షల కోట్లు దూసుకెళ్లి... మన మార్కెట్లలో ‘మంగళ’వారం ఆనందాన్ని నింపింది.

ముంబై: బడ్జెట్ రోజు తీవ్ర ఊగిసలాటకు గురైన మన మార్కెట్లలో మళ్లీ బుల్ ఉరకలేసింది. మంగళవారం ట్రేడింగ్ ఆరంభం నుంచే లాభాలతో మొదలైన బీఎస్‌ఈ సెన్సెక్స్... ఆ తర్వాత మరింత జోరందుకుంది. ఎఫ్‌ఎంసీజీ, వాహన, రియల్టీ షేర్ల దూకుడుతో ఒకానొక దశలో సెన్సెక్స్ క్రితం ముగింపు 23,002 పాయింట్లతో పోలిస్తే 819 పాయింట్లు ఎగిసి 23,821 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. చివరకు 777 పాయింట్లు లాభంతో(3. 38%) 23,779 వద్ద స్థిరపడింది. 2009 మే18న ఒకే రోజు సెన్సెక్స్ 2,111 పాయింట్లు పెరగగా... మళ్లీ ఒక్కరోజులో అతిపెద్ద లాభం ఇదే కావడం విశేషం. నిఫ్టీ కూడా 235 పాయింట్లు దూసుకెళ్లి(3.37%) 7,222 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ పుంజుకోవడం కూడా మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. ఇటీవల తీవ్రంగా పతనమైన కొన్ని షేర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు, షార్ట్ కవరింగ్ కూడా తాజా ర్యాలీకి దన్నుగా నిలిచిందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

 జోష్ నింపిన ‘ద్రవ్యలోటు’...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును (జీడీపీతో పోలిస్తే) 3.9 శాతానికి పరిమితం చేస్తూనే... వచ్చే ఏడాది 3.5 శాతం లక్ష్యానికి కట్టుబడి ఉంటామన్న ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రకటన మార్కెట్లలో ప్రధానంగా జోష్ నింపింది. బడ్జెట్ చాలా సమతూకంతో ఉందని.. ప్రభుత్వం మార్కెట్ల నుంచి రుణ సమీకరణను తగ్గించుకోనుండటంతో ఆర్‌బీఐకి వడ్డీరేట్ల తగ్గింపునకు ఆస్కారం లభించనుందని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణకు మోదీ సర్కారు పెద్దపీట వేయడం ఇన్వెస్టర్లలో రేట్ల కోతపై ఆశలు పెంచిందని ఆయన పేర్కొన్నారు. మరోపక్క, బడ్జెట్ సానుకూలతతో ప్రస్తుత ఏడాది ఆర్‌బీఐ అర శాతం పాలసీ వడ్డీరేటు(రెపో రేటు) అర శాతం మేర తగ్గించే అవకాశం ఉందని అంతర్జాతీయ బ్రోకరేజి దిగ్గజం యూబీఎస్ రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. మరోపక్క, ఇన్‌ఫ్రా రంగానికి అధిక నిధుల ప్రభావంతో స్టీల్ రంగ షేర్లు పుంజుకున్నాయి.

 ఇతర ముఖ్యాంశాలివీ...
బీఎస్‌ఈ సెన్సెక్స్ 30 షేర్ల జాబితాలో 27 స్టాక్స్ లాభాలతో ముగిశాయి.

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ అత్యధికంగా 10 శాతం మేర ఎగబాకి రూ. 325 వద్ద ముగిసింది. ఇక అధికంగా లాభపడిన వాటిలో ఐసీఐసీఐ బ్యాంక్(7.75%), మారుతీ సుజుకీ(7.8%), హీరో మోటోకార్ప్(6.7%), అదానీ పోర్ట్స్(5.3%), గెయిల్(5%), టాటా మోటార్స్(5%), యాక్సిస్ బ్యాంక్(4.4%), టీసీఎస్(4.3%), ఎల్‌అండ్‌టీ(4.12%), ఇన్ఫోసిస్(3.76%), ఎంఅండ్‌ఎం(3.22%), టాటా స్టీల్(3.13%), విప్రో(2.9%) వంటివి ఉన్నాయి.

అత్యధికంగా ఎఫ్‌ఎంసీజీ సూచీ 4.9 శాతం దూసుకెళ్లింది. ఆ తర్వాత కన్సూమర్ డ్యూరబుల్స్ సూచీ 4.37 శాతం, రియల్టీ 4.21 శాతం, ఆటోమొబైల్స్ ఇండెక్స్ 4.19% చొప్పున ఎగబాకాయి. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 3.23 శాతం, మిడ్‌క్యాప్ సూచీ 3.04 శాతం లాభపడ్డాయి.

మంగళవారం ప్రాథమిక గణాంకాల ప్రకారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.2,913 కోట్లను నికరంగా ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(డీఐఐ) రూ.835 కోట్ల నికర విక్రయాలు జరిపారు.

 ఇన్వెస్టర్ల సంపద రయ్..
స్టాక్ మార్కెట్ జోరుతో ఇన్వెస్టర్ల సంపద కూడా పరుగులు తీసింది. బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) మంగళవారం రూ.2.5 లక్షల కోట్ల మేర ఎగబాకింది. రూ.88.34 లక్షల కోట్లకు చేరింది.

చైనా ‘పాలసీ’ జోష్..
మందగమనంలోకి జారిపోతున్న ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చే చర్యల్లో భాగంగా చైనా సెంట్రల్ బ్యాంక్ తాజాగా పాలసీ ఉద్దీపన చర్యలను ప్రకటించింది. రిజర్వ్ రిక్వయిర్‌మెంట్ రేషియో (ఆర్‌ఆర్‌ఆర్ - బ్యాంకులు తమ డిపాజిట్లలో సెంట్రల్ బ్యాంక్ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన నిధుల పరిమాణం)ను మరో అర శాతం తగ్గించి.. 17 శాతానికి చేర్చింది. వ్యవస్థలోకి మరిన్ని నిధులను అందుబాటులోకి తెచ్చింది. ఈ పాలసీ ఉద్దీపనతో షాంఘై ఇండెక్స్ 1.7 శాతం పెరిగింది. ఆసియాలో ఇతర ప్రధాన సూచీలు కూడా లాభాల్లో నిలిచాయి. యూరప్ సూచీలు కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. అటు అమెరికా మార్కెట్లు సైతం 1 శాతంపైగా లాభాలతో ట్రేడవుతున్నాయి.

3 వారాల గరిష్టానికి రూపాయి
57 పైసలు అప్, 67.85 వద్ద క్లోజింగ్

ముంబై: దేశీ ఈక్విటీ మార్కెట్లు కోలుకుని బ్యాంకులు, ఎగుమతిదార్లు తాజాగా డాలర్లను విక్రయించడంతో మంగళవారం రూపాయి మారకం విలువ భారీగా పెరిగింది. డాలర్‌తో పోలిస్తే 57 పైసలు బలపడి మూడు వారాల గరిష్టమైన 67.85 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఒక్క రోజులో ఇంత అత్యధికంగా రూపాయి లాభపడటం ఇదే ప్రథమం. విదేశీ మార్కెట్లలో డాలర్ బలహీనంగా ఉండటం కూడా దేశీ కరెన్సీ బలపడటానికి దోహదపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement