
నేడు (8న) దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు సానుకూలంగా ప్రారంభమయ్యే వీలుంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.25 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 48 పాయింట్లు పుంజుకుని 10,804 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్ 10,756 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సరికొత్త గరిష్టాలను తాకుతున్న యూఎస్ మార్కెట్లలో ట్రేడర్లు మంగళవారం లాభాల స్వీకరణకు తెర తీశారు. దీనికితోడు కోవిడ్-19 కేసులు తిరిగి పెరుగుతున్న నేపథ్యంలో యూరోప్, యూఎస్ మార్కెట్లు 1.5-1 శాతం మధ్య క్షీణించాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దేశీ స్టాక్ మార్కెట్లు తొలుత హుషారుగా ప్రారంభమైనప్పటికీ తదుపరి ఆటుపోట్లను చవిచచూడవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్కెట్లు వరుసగా ఐదు రోజులపాటు ర్యాలీ చేయడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగే వీలున్నట్లు భావిస్తున్నారు.
5వ రోజూ..
స్వల్ప ఒడిదొడుకుల మధ్య మంగళవారం వరుసగా ఐదో రోజూ దేశీ స్టాక్ మార్కెట్లు ర్యాలీ చేశాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యం ఇవ్వడంతో చివరికి సెన్సెక్స్ 187 పాయింట్లు జమ చేసుకుని 36,675 వద్ద ముగిసింది. గత 4 రోజుల్లో సెన్సెక్స్ 1572 పాయింట్లు జంప్‌చేసిన విషయం విదితమే. ఇకనిఫ్టీ 36 పాయింట్లు బలపడి 10,800 వద్ద నిలిచింది. కాగా.. సెన్సెక్స్ ఒక దశలో 36,271 వద్ద కనిష్టానికి చేరగా.. 36,723 వద్ద గరిష్టాన్నీ తాకింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 10,722 పాయింట్ల వద్ద, తదుపరి 10,644 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,846 పాయింట్ల వద్ద, ఆపై 10,892 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,221 పాయింట్ల వద్ద, తదుపరి 21,813 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,855 పాయింట్ల వద్ద, తదుపరి 22,485 స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.
ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 830 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 784 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 348 కోట్లు, డీఐఐలు రూ. 263 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే.