
నేడు (23న) దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 14 పాయింట్లు బలహీనపడి 11,112 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్ 11,126 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కాలిఫోర్నియా, ఫ్లోరిడా తదితర పలు రాష్ట్రాలలో కోవిడ్-19 మరింత వేగంగా విస్తరిస్తుండటంతో ప్రభుత్వం మరోసారి భారీ ప్యాకేజీని తీసుకురానున్నదన్న అంచనాలు బుధవారం యూఎస్ మార్కెట్లకు బలాన్నిచ్చాయి. దీంతో ఆటుపోట్ల మధ్య ఇండెక్సులు 0.6-0.3 శాతం స్థాయిలో బలపడ్డాయి. యూరోపియన్ మార్కెట్లు మాత్రం 1.3-0.5 శాతం మధ్య వెనకడుగు వేశాయి. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. తైవాన్, కొరియా, చైనా 0.6 శాతం స్థాయిలో బలహీనపడగా.. ఇండొనేసియా, హాంకాంగ్, సింగపూర్ అదే స్థాయిలో పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దేశీ స్టాక్ మార్కెట్లు తొలుత ఒడిదొడుకులతో ప్రారంభంకావచ్చని, తదుపరి ఆటుపోట్లు చవిచూడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
కన్సాలిడేషన్‌లో..
ఐదు రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు బుధవారం కన్సాలిడేషన్ బాట పట్టాయి. ఒడిదొడుకుల మధ్య స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 59 పాయింట్లు క్షీణించి 37,871 వద్ద నిలవగా.. నిఫ్టీ 30 పాయింట్లు తక్కువగా 11,132 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 11,238- 11,057 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,047 పాయింట్ల వద్ద, తదుపరి 10,961 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 11,228 పాయింట్ల వద్ద, ఆపై 11,324 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,623 పాయింట్ల వద్ద, తదుపరి 22,364 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్ నిఫ్టీకి తొలుత 23,177 పాయింట్ల వద్ద, తదుపరి 23,470 స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.
ఎఫ్‌పీఐలు భళా..
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1666 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1139 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 2266 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 727 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment