
రూపాయి బలోపేతం...ఆర్థిక శక్తికి నిదర్శనం
యొకోహామా (జపాన్): రూపాయి విలువ పెరగడం దేశ ఆర్థికశక్తికి నిదర్శనమని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్‌దాస్ పేర్కొన్నారు. ఇక్కడ జరుగుతున్న ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ వార్షిక సమావేశాల్లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తరఫున పాల్గొనడానికి ఇక్కడకు విచ్చేసిన శక్తికాంత్ దాస్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రూపాయికి సంబంధించి భారత్ ప్రభుత్వం ఎటువంటి లక్ష్యాన్నీ నిర్దేశించుకోలేదని తెలిపారు. భారత్ కరెన్సీ ఆసియాలోనే అత్యుత్తమ రీతిన బలపడిందని వివరించారు.
రూపాయి మార్కెట్ విలువ ఎంతుండాలన్న విషయం మార్కెట్ నిర్ణయిస్తుంది తప్ప, ఈ విషయంలో కేంద్రం జోక్యం ఏదీ ఉండబోదన్నారు. రూపాయి విలువ ఏ స్థాయిలో ఉండాలన్నది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ అంశాలను పరిశీలిస్తుందని పేర్కొన్న ఆయన మారకపు విలువలో ఒడిదుడుకులు దాదాపు ఏమీ లేవనీ అన్నారు. కాగా వస్తు సేవల పన్ను ఇస్తున్న ప్రయోజనాల వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్ వృద్ధిరేటు 8 శాతం ఉంటుందని భావిస్తున్నట్లు దాస్ పేర్కొన్నారు.