పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ షేర్లకు ఏమైంది?
ముంబై : గత వారం రోజుల ట్రేడింగ్ సెషన్స్ లో బ్యాంకింగ్ షేర్లు పేలవ ప్రదర్శనిచ్చాయి. చాలా పబ్లిక్ రంగ బ్యాంకు షేర్లు నష్టాలనే నమోదుచేశాయి. దీంతో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ పీఎస్ యూ ఇండెక్స్ 8శాతం మేర పడిపోయింది. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులు గత 10 ట్రేడింగ్ సెషన్స్ లో 7 సార్లు నష్టాలోనే నిలిచాయి. బ్యాంకు బరోడా అయితే పది ట్రేడింగ్ లో ఎనిమిది సార్లు నష్టాలను నమోదుచేసింది. మిగతా పబ్లిక్ రంగ బ్యాంకులు యూనియన్ బ్యాంకు, యూసీఓ బ్యాంకు, ఇండియన్ ఓవర్ సిస్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంకు, జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంకులు సైతం ఈ 10 ట్రేడింగ్ సెషన్స్ లో దాదాపు నష్టాలోనే నడిచాయని గణాంకాలు చెబుతున్నాయి.
ఎస్బీఐ షేర్లు 8.8శాతం, పీఎన్ బీ షేర్లు 8.82శాతం, బీఓబీ షేర్లు 6శాతం, యూనియన్ బ్యాంకు షేర్లు 10శాతం, సెంట్రల్ బ్యాంకు 1.4శాతం, ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకు 6.4శాతం, అలహాబాద్ బ్యాంకు 8.6శాతం, ఓరియంటల్ బ్యాంకు 12శాతం, జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంకు 11.5శాతం నష్టపోయాయని గణాంకాలు వెల్లడించాయి. మొండిబకాయిలు సెగ ఎక్కువగా ఉండటంతో, మార్కెట్లో బ్యాంకులు సరిగ్గా ప్రదర్శించలేకపోతున్నాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. పెట్టుబడుల పరంగా సవాళ్లను ఎదుర్కోవడం, ఆర్థిక పనితీరు అంచనా వేసినంత లేకపోవడంతో బ్యాంకు షేర్లు నష్టాల బాట పట్టాయని గణాంకాలు చెబుతున్నాయి. వచ్చే వారంలో బ్యాంకులు త్రైమాసిక ఫలితాలను ప్రకటించబోతుండటంతో, లాభాల ఫలితాలు ఆస్తులపై ప్రభావం చూపనున్నాయని వెల్లడిస్తున్నాయి. మొండి బకాయిలు కూడా పెరగబోతున్నట్టు పేర్కొన్నాయి. అదేవిధంగా ప్రభుత్వరంగ బ్యాంకులకు సగంగా ఉంటున్న ఐసీఐసీఐ సైతం ఈ త్రైమాసికంలో పేలవ ఫలితాలనే నమోదుచేసింది.